కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయండి
ABN , Publish Date - Mar 18 , 2026 | 05:49 AM
తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి.....
వేం నరేందర్ రెడ్డికి ఖర్గే, కేసీ సూచన
న్యూఢిల్లీ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ సూచించారు. మంగళవారం ఢిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఖర్గేను ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ కలిశారు. వేం నరేందర్ రెడ్డిని ఖర్గేకు పరిచయం చేశారు. తొలుత.. ఇందిరా భవన్‌లో కేసీ వేణుగోపాల్‌కు వేంను పరిచయం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా తనదైన ముద్ర వేయాలని వేం నరేందర్ రెడ్డికి ఖర్గే, కేసీ సూచించారు. రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఖర్గే, కేసీలకు వేం నరేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఖర్గేతో సీఎం రేవంత్, మహేశ్ గౌడ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయాలు, బడ్జెట్ సమావేశాలపై ఖర్గేతో చర్చించినట్లు తెలిసింది. కాంగ్రెస్ పెద్దలను కలిసిన వారిలో ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, సురేశ్ షెట్కర్ ఉన్నారు. కాగా, బుధవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉంది. ఉదయ 10గంటల తర్వాత పార్లమెంట్ కు వెళ్లనున్ను సీఎం.. అక్కడే కొందరు కేంద్ర మంత్రులతోనూ భేటీ అవుతారని సమాచారం.