వెలుగుమట్ల పేదలకు ఇందిరమ్మ ఇళ్లు
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:14 AM
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో అర్హులైన పేదలుంటే తప్పనిసరిగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు....
అర్హులకు పునరావాసం కల్పించాల్సిందే
వసూళ్ల మాఫియాను ఉపేక్షించేదిలేదు
మంత్రి తుమ్మలతో చెప్పిన సీఎం రేవంత్
హైదరాబాద్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో అర్హులైన పేదలుంటే తప్పనిసరిగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు పునరావాసం కల్పిస్తామని, అదే క్రమంలో పేదల నుంచి డబ్బులు వసూలుచేసి అక్రమాలకు పాల్పడుతున్న మాఫియాను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివిధ అంశాలపై ఆయనతో చర్చించారు. భూదాన్ భూము లు ఖాళీ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చిందని, సీసీఎల్‌ఏకు ఆదేశాలిచ్చిన నేపథ్యంలోనే భూములు ఖాళీ చేయిస్తున్నట్లు తెలిపారు. అయితే వెలుగుమట్లలో మాఫియా తయారైందని, మాఫియాకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేది లేదని స్పష్టం చేశారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కొందరు నివాసం ఉంటున్నచోట తాగునీరు, వీధి దీపాలు, రోడ్లు వంటి మౌలిక వసతులు లేవన్నారు. కొత్తగా ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించే చోట అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఇళ్లు మంజూరు చేయాలని సీఎం తుమ్మలకు సూచించారు. ఇదిలాఉండగా సిద్దిపేట జిల్లా నర్మెట్ట పామాయిల్ యూనిట్ ప్రారంభోత్సవానికి సమయం ఇవ్వాలని సీఎంను తుమ్మల కోరారు. హైదరాబాద్ శివారులో కోహెడ మార్కెట్ యార్డు పనులను త్వరితగతిన చేపట్టడానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి మంత్రి తుమ్మలను మర్యాదపూర్వకంగా కలిశారు. నరేందర్‌రెడ్డికి తుమ్మల పుష్పగుచ్చం అందజేసి, శాలువా కప్పి సన్మానించారు. వేం నరేందర్‌రెడ్డి రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావ టం హర్షణీయని, రాష్ట్రం, ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు.