Share News

వెలుగుమట్లలో ‘మోడల్‌ కాలనీ’

ABN , Publish Date - Mar 12 , 2026 | 05:27 AM

పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడు చట్టబద్ధంగా జీవించేందుకు అవసరమైన అన్ని చర్యలూ.....

వెలుగుమట్లలో ‘మోడల్‌ కాలనీ’

  • డిసెంబరు 9న సీఎం రేవంత్‌తో గృహప్రవేశాలు చేయిస్తాం.. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యం

  • వెలుగుమట్ల బాధితుల పట్ల బీఆర్‌ఎ్‌సది మొసలి కన్నీరే.. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి

ఖమ్మం, మార్చి11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడు చట్టబద్ధంగా జీవించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్‌ భూముల్లో నుంచి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించిన తర్వాత మిగిలిన 16 ఎకరాల్లో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌, గురుకుల పాఠశాలలు నిర్మిస్తామని తెలిపారు. ఆ భూములను ఇతరులకు కేటాయించబోమని స్పష్టం చేశారు. ఇటీవలి కూల్చివేతల్లో ఇళ్లు కోల్పోయిన బాధితుల్లో తొలి విడతగా 412 మందిని అర్హులుగా గుర్తించారు. వారిలో ఖమ్మం నియోజకవర్గం పరిధిలో ఉన్న 311 మందికి వెలుగుమట్లలోని కూల్చిన ప్రాంతంలో, మిగిలిన 101 మందికి ఇతర నియోజకవర్గాల్లోని వారివారి మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో భట్టి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల చేతుల మీదుగా ఇళ్ల స్థలాల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ..వెలుగుమట్లలో ఇందిరమ్మ ఇళ్లను మోడల్‌ కాలనీగా నిర్మించి, డిసెంబరు 9న సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా గృహప్రవేశాలు చేయించేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కాలనీ లో మౌలిక సదుపాయాలతోపాటు కమ్యూనిటీ హాల్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మిస్తామని.. గురువారం నుం చే ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన దళారుల ముఠాపై ఉక్కుపాదం మోపాలని, తిరిగి పేదలకు డబ్బులు ఇప్పించే లా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం: భట్టి

ప్రభుత్వంపై బురద చల్లేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, తప్పుడు ప్రచారం చేశారని భట్టి ఆరోపించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఒక్క ఏడాదిలోనే మంజూరు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదని తెలిపారు. కాగా సోనియాగాంధీ పుట్టిన రోజైన డిసెంబరు 9న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా గృహప్రవేశాలు చేయించి.. వెలుగుమట్లలోని పేదల ఇందిరమ్మ ఇళ్ల కాలనీని ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పేదల సంఘం ముసుగులో కొందరు ఇక్కడ భూమిని ఆక్రమించి, డబ్బు వసూలు చేసి, తాత్కాలిక ఇళ్లు నిర్మింపజేశారని తెలిపారు. ఈ ముఠాపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ వెలుగుమట్ల బాధితుల పట్ల మొసలి కన్నీరు కారుస్తోందని, వారు అధికారంలో ఉన్నప్పుడు బాధితులను ఎందుకు ఆదుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఇది నిజమైన పేదల ప్రభుత్వమని, అందుకే 15రోజుల్లోగా వెలుగుమట్ల బాధితులకు ఇళ్ల స్థలాలపట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు.

Updated Date - Mar 12 , 2026 | 05:27 AM