వెలుగుమట్ల పేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు
ABN , Publish Date - Mar 02 , 2026 | 02:15 AM
ఖమ్మం సమీపంలోని వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన నిరుపేదలందరికీ ఈనెల 15వ తేదీలోగా నివాసయోగ్యంగా ఉన్న ప్రాంతాల్లో ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు....
15వ తేదీలోగా మంజూరు చేస్తాం
డబ్బు వసూలు చేసి భూదాన్ భూముల్లో ఇళ్లు ఇచ్చిన ముఠాను అరెస్టు చేస్తాం
ఆ డబ్బును తిరిగి బాధితులకు ఇప్పిస్తాం
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం, మార్చి 1 ( ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఖమ్మం సమీపంలోని వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన నిరుపేదలందరికీ ఈనెల 15వ తేదీలోగా నివాసయోగ్యంగా ఉన్న ప్రాంతాల్లో ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. వెలుగుమట్లలో భూదాన్‌కు సంబంధించిన 31 ఎకరాల భూముల్లో నిరుపేదలతోపాటు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, గతంలో ఇందిరమ్మ ఇళ్లు తీసుకున్న వారు పొరుగు జిల్లాల నుంచి కూడా వచ్చి ఉంటున్నారని మంత్రి తెలిపారు. వీళ్లలో కొందరు ఓ ముఠాకి రూ.30 వేల నుంచి రూ.8 లక్షల వరకు డబ్బు చెల్లించి షెడ్లు నిర్మించుకున్నారని చెప్పారు. ఆ ముఠాను అరెస్టు చేస్తామని అంతేకాక ముఠా వసూలు చేసిన డబ్బును రికవరీ చేసి బాధితులకు చెల్లిస్తామని మంత్రి స్పష్టం చేశారు. వెలుగుమట్ల బాధితులతో ఖమ్మం కలెక్టరేట్‌లో ఆదివారం సమావేశమైన మంత్రి పొంగులేటి ఈ మేరకు మాట్లాడారు. బాధితులందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రి పొంగులేటి విలేకరులతో మాట్లాడుతూ.. భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన 720 కుటుంబాలను గుర్తించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, వెలుగుమట్లలో నష్టపోయిన స్థానిక పేదలందరికీ ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ముగ్గుపోసి నిర్మిస్తామన్నారు. 15 రోజుల్లో ఈ కార్యక్రమం మొదలవుతుందని తెలిపారు. వీరందరికీ విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలతోపాటు, అంగన్‌వాడీ సెంటర్, ప్రభుత్వ స్కూలు ఏర్పాటు చేస్తామని వారు గౌరవంగా జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జిల్లాకు చెందిన మంత్రులతోపాటు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారని చెప్పారు. గత ప్రభుత్వం పేదలకు న్యాయం చేయలేదని, ఇళ్లు కూల్చి నష్టం చేసిందన్నారు.
జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనా తప్పుడు ప్రచారాలు చేస్తున్న కొన్ని పత్రికలు, ఛానెళ్లు నిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. వెలుగుమట్లతో పాటు కొన్నిచోట్ల జరుగుతున్న సంఘటనలపై తమ రాజకీయ స్వలాభం కోసం ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీకి ఫండ్‌గా రూ.100కోట్లు పంపించేందుకు ఈ భూమిని ఖాళీ చేయించినట్టు కొందరు మాట్లాడుతున్నారని.. ఇలా మాట్లాడే వారి చరిత్ర ఏంటో ప్రజల ఎదుట బయట పెడతామని తెలిపారు. శవాలపై చిల్లర ఏరుకునే కొందరు నాయకులు రాజకీయ స్వార్థం కోసం ప్రభుత్వంపై, జిల్లాకు చెందిన మంత్రులపై బురదజల్లడమే లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఈ పేదలు ఎందుకు గుర్తురాలేదని పొంగులేటి ప్రశ్నించారు. భూదాన్ భూముల్లో ప్రభుత్వానికి సంబంధం లేకుండా అధికారుల అనుమతులు లేకుండా వసూళ్ల ముఠా సభ్యులే డబ్బులు తీసుకొని పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చారన్నారు. ఎదురు ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడ్డారని మంత్రి వివరించారు. పేదల నుంచి డబ్బు వసూలు చేసిన ఆ ముఠాను శిక్షిస్తామన్నారు. వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు నిర్మించి వారికి గౌరవప్రద జీవితం కల్పించే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
3.60లక్షలు తీసుకున్నారు..
మాది చింతకాని మండలం రేపెల్లెవాడ. నా భర్త డ్రైవింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కృష్ణ, రామచంద్రయ్య అనే వ్యక్తులకు ఎనిమిదేళ్ల క్రితం దశలవారీగా రూ. 3.60 లక్షలను కట్టి షెడ్డు వేసుకొని జీవనం సాగిస్తున్నాం. మాతో పాటు మా బంధువులు కూడా మరో రూ.3 లక్షలు ఇచ్చారు. ఇంటికి పట్టా ఇస్తామని నమ్మించి మోసం చేశారు. కరెంటు లేకపోయినా.. నీళ్లు లేక పోయినా.. వారి మాటలు నమ్మి పట్టా వస్తుందని డబ్బు ఇచ్చాం.
- రజియా ( బాధితురాలు)
ఇంటితోపాటు డబ్బూ ఇప్పించండి
మాది పెనుబల్లి మండలం టేకులపల్లి. రూ. 2లక్షలు ఇచ్చి రెండు ప్లాట్లు తీసుకున్నాం. నాపేరు మీద, మా పాప పేరున ్చ రెండు ప్లాట్లు తీసుకున్నాం. అందరికీ పట్టాలు వస్తాయంటే షెడ్డు నిర్మించుకొని నివాసం ఉంటున్నాం. ఒక్కసారిగా కూల్చివేయడంతో నష్టపోయాం. మాకు ఇంటితో పాటు కట్టిన డబ్బు ఇప్పించండి.
- తీగల రమాదేవి ( బాధితురాలు)