Share News

వెలుగుమట్ల కూల్చివేతలపై 24న విచారణ

ABN , Publish Date - Mar 19 , 2026 | 03:59 AM

ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని భూదాన్‌ భూముల్లో ఇళ్ల కూల్చివేతల వ్యవహారంపై ఈనెల 24న వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది.

వెలుగుమట్ల కూల్చివేతలపై 24న విచారణ

హైదరాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని భూదాన్‌ భూముల్లో ఇళ్ల కూల్చివేతల వ్యవహారంపై ఈనెల 24న వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది. ఎలాంటి నోటీసులు లేకుండా ఫిబ్రవరి 24న ప్రభుత్వ అధికారులు తమ ఇళ్లు కూల్చివేశారంటూ తాళ్లూరి వెంకటనర్సమ్మ మరో 23 మంది దినసరి కూలీలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 2012లో భూదాన్‌ యజ్ఞబోర్డు తమకు దాదాపు 100 చదరపు గజాల చొప్పున ఇళ్ల పట్టాలు జారీ చేసిందని, ఆ స్థలాల్లోనే ఇళ్లు నిర్మించుకున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 2014లో కూడా కూల్చివేతలకు ప్రయత్నం జరిగిందని, తాము హైకోర్టును ఆశ్రయించడంతో కూల్చివేతలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ప్రస్తుతం భూదాన్‌ యజ్ఞ బోర్డుకు పాలకవర్గం లేదని, భూదాన్‌ బోర్డు తరఫున సీసీఎల్‌ఏ కూల్చివేత ఆదేశాలు జారీ చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. పిటిషనర్లను అక్రమణదారులంటూ రెవెన్యూ శాఖ జారీ చేసిన ఆదేశాలను కొట్టేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అలాగే, తమకు కేటాయించిన అదే స్థలాల్లో నూతన గృహాలు నిర్మించి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని, నష్ట పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. నష్టపరిహారాన్ని అంచనా వేయడానికి అడ్వకేట్‌ కమిషనర్‌ను నియమించాలని కోరారు. ఈ పిటిషన్‌ జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం ఎదుట బుధవారం విచారణ జాబితాలో ఉంది. కోర్టు సమయం పూర్తయ్యే సరికి ఈ పిటిషన్‌ విచారణకు రాకపోవంతో పిటిషనర్ల తరఫు న్యాయవాది.. దీనిపై వాదనలు వినాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 24న వాదనలు వింటామని ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

Updated Date - Mar 19 , 2026 | 03:59 AM