Share News

మేమూ నిర్వాసితులమే.. మాకు కూడా పట్టాలివ్వండి

ABN , Publish Date - Mar 17 , 2026 | 04:43 AM

తాము సైతం వెలుగుమట్ల ఘటనలో నిర్వాసితులమేనని తమకు ఇంకా పట్టాలు అందలేదంటూ పలువురు సోమవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి తరలివచ్చారు.

మేమూ నిర్వాసితులమే.. మాకు కూడా పట్టాలివ్వండి

  • ఖమ్మం కలెక్టరేట్‌లో ప్రజావాణికి తరలివచ్చిన వెలుగుమట్ల బాధితులు

ఖమ్మం కలెక్టరేట్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : తాము సైతం వెలుగుమట్ల ఘటనలో నిర్వాసితులమేనని తమకు ఇంకా పట్టాలు అందలేదంటూ పలువురు సోమవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి తరలివచ్చారు. కాగా వీరిని లోపలికి అనుమతించలేదు. అధికారుల సూచన మేరకు వారంతా గ్రీవెన్స్‌ ఇన్‌వార్డులో దరఖాస్తులు సమర్పించి రశీదు తీసుకుని తిరిగి వెళ్లారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని భూదాన్‌ భూముల్లో పేదల తాత్కాలిక నివాసాలను.. గతనెలలో ప్రభుత్వం కూల్చివేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కొందరు ముఠాగా ఏర్పడి పేదల నుంచి డబ్బులు వసూలు చేసి ఈ భూముల్లో గుడిసెలు, షెడ్లు వేయించారని.. కూల్చివేతల వల్ల ఆ పేదలు నష్టపోయారని సర్కారు గుర్తించింది. దీంతో వారికి అదే ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. ఈనెల 11న అసలైన బాధితులకు పట్టాలను, ఇంటి పత్రాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందజేశారు. ఆనాటి నుంచి చాలామంది తామూ బాధితులమేనంటూ.. తమకూ న్యాయం చేయాలని ఖమ్మం ఆర్డీవో, అర్బన్‌ తహసీల్దార్లకు దరఖాస్తులను అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజావాణికి తరలివచ్చారు.

Updated Date - Mar 17 , 2026 | 04:43 AM