Share News

రూ.వెయ్యి కోసం ప్రాణం తీశారు

ABN , Publish Date - Jul 14 , 2026 | 06:01 AM

హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో కలకలం రేపిన అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్యగా తేల్చారు. కేవలం రూ.1000 నగదు, సెల్‌ఫోన్‌ కోసం ఓ వ్యక్తిని బండరాయితో మోది కిరాతకంగా..

రూ.వెయ్యి కోసం ప్రాణం తీశారు

  • వనస్థలిపురం అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్‌ నిజాలు

వనస్థలిపురం, జూలై 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో కలకలం రేపిన అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్యగా తేల్చారు. కేవలం రూ.1000 నగదు, సెల్‌ఫోన్‌ కోసం ఓ వ్యక్తిని బండరాయితో మోది కిరాతకంగా చంపినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. శనివారం అర్ధరాత్రి వనస్థలిపురంలోని ఎంఆర్‌ఆర్‌ వైన్స్‌ వద్ద మద్యం తాగి పడి ఉన్న ఒక గుర్తుతెలియని వ్యక్తిని పాత నేరస్థుడు శ్రీరాములు, అతడి స్నేహితుడు నరసింహ గమనించారు. అతడి జేబులో డబ్బులు ఉన్నట్లు గుర్తించి వెంబడించారు. ఆ గుర్తుతెలియని వ్యక్తి అక్కడి నుంచి లేచి ఏఆర్టీ థియేటర్‌ ఎదురుగా ఉన్న పెట్రోల్‌ బంక్‌ పక్కన ఓ షెటర్‌ వద్ద పడుకున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితులిద్దరూ అతడి వద్ద ఉన్న రూ.1000 నగదు, సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. దాంతో అతడు నిద్రలేచి వారితో గొడవపడి, గట్టిగా కేకలు వేశాడు. ఎక్కడ దొరికిపోతామో అన్న భయంతో శ్రీరాములు, నరసింహలు పక్కనే ఉన్న రాయితో అతడి తలపై బలంగా కొట్టి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దొంగిలించిన సెల్‌ఫోన్‌లో ఉన్న సిమ్ములను తీసివేసిన నరసింహ, ఆ ఫోన్‌ను తన సోదరుడు సుధాకర్‌కు ఇచ్చాడు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు, ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. మృతుడి ఫోన్‌లోని సిమ్‌ కార్డులను నిందితులు పారేయడంతో అతడి వివరాలు తెలియరాలేదు. కాగా, శ్రీరాములుపై 2013లో ద్విచక్ర వాహన చోరీ కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Jul 14 , 2026 | 06:02 AM