Share News

రాజ్యసభ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి!

ABN , Publish Date - Feb 28 , 2026 | 03:54 AM

తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా మరో పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా సంస్థాగత వ్యవహారాలు చూస్తున్న వంశీచంద్‌రెడ్డి పేరును అధిష్ఠానం పెద్దలు కొందరు ప్రతిపాదిస్తున్నట్లు....

రాజ్యసభ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి!

  • ప్రతిపాదిస్తున్న పలువురు ఏఐసీసీ పెద్దలు

  • అధిష్ఠానం కోటాలో ఇప్పటికే అభిషేక్‌ సింఘ్వి పేరు ఖరారు

  • రాష్ట్ర కోటాలో సీఎం రేవంత్‌ అభిప్రాయానికే ఏఐసీసీ ఓటు

హైదరాబాద్‌/వికారాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా మరో పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా సంస్థాగత వ్యవహారాలు చూస్తున్న వంశీచంద్‌రెడ్డి పేరును అధిష్ఠానం పెద్దలు కొందరు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికలు జరగనున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి అధిష్ఠానం కోటాలో అభిషేక్‌ మనుసింఘ్వికి ఇప్పటికే ఖరారైనట్లు చెబుతున్నారు. రాష్ట్ర కోటాలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌, ఎస్సీ మాదిగ సామాజికవర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, పార్టీ సీనియర్‌ నేత దొమ్మాట సాంబయ్య, బీసీల నుంచి పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతరావు తదితరుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర కోటా సీటుకు అధిష్ఠానం వంశీచంద్‌రెడ్డి పేరును ప్రతిపాదిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే యువ నాయకుడిగా ఉన్న తనకు.. అప్పుడే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని రాజ్యసభ సభ్యత్వం తీసుకోవడం పట్ల ఆసక్తి లేదంటూ వంశీచంద్‌రెడ్డి.. తన సన్నిమితుల వద్ద అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన వంశీచంద్‌రెడ్డికి అవకాశం కల్పిస్తే.. భవిష్యత్తులో ఎమ్మెల్సీ పదవుల కోసం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన వారి నుంచి డిమాండ్లు రావచ్చునన్న అభిప్రాయాలూ పార్టీలో వ్యక్తమవుతున్నాయి. అయితే రాష్ట్ర కోటాలో అభ్యర్థి నిర్ణయంలో సహజంగానే సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయానికే అధిష్ఠానం విలువ ఇస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం ఎవరికి ఓటు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

తేల్చనున్న రాహుల్‌ టూర్‌..!

వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో జరుగుతున్న ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్ష ణ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మార్చి 2న తెలంగాణకు వస్తున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో నేరుగా అనంతగిరికి వెళ్లనున్న రాహుల్‌గాంధీ.. అదే రోజు సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళతారు. అనంతగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో రాహుల్‌ భేటీ కానున్నట్లు చెబుతున్నారు. ఆ భేటీలో రాజ్యసభ అభ్యర్థులపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు.

Updated Date - Feb 28 , 2026 | 03:54 AM