‘వాహన్’తో ఎన్ని తిప్పలో?
ABN , Publish Date - Apr 20 , 2026 | 05:15 AM
‘వాహన్ సేవ’ల్లో ఇవేం తిప్పలు బాబోయ్! ఇదీ.. వాహనదారుల మాట! రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అక్రమ వసూళ్లకు అవకాశం లేకుండా, జాప్యానికి తావేలేకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు...
శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ తీవ్ర ఆలస్యం.. పోర్టల్ సేవలపై కొత్త వాహనదారుల్లో అసహనం
2, 3 వారాలైనా జరగని శాశ్వత రిజిస్ట్రేషన్
పోర్టల్ సేవలు ప్రారంభమైన నెలరోజుల్లో
గ్రేటర్‌లో ఇప్పటిదాకా 1500 వాహనాలకే పీఆర్
టీఆర్‌లోనూ జాప్యమే.. సాంకేతిక సమస్యలతోనే?
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ‘వాహన్ సేవ’ల్లో ఇవేం తిప్పలు బాబోయ్! ఇదీ.. వాహనదారుల మాట! రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అక్రమ వసూళ్లకు అవకాశం లేకుండా, జాప్యానికి తావేలేకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు తెచ్చిన ‘వాహన్ సేవ’ను ప్రవేశపెట్టి దాదాపు నెలరోజులు కావొస్తున్నా రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. సాంకేతిక సమస్యలో, ఇతర మరే కారణాలో తెలియదు గానీ కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ల (పర్మినెంట్ రిజిస్ట్రేషన్-పీఆర్) ప్రక్రియకు తీవ్ర ఆలస్యం అవుతోంది. ఫలితంగా వాహనాలు కొనుగోలు చేసి మూడు వారాలకు పైనే అవుతున్నా శాశ్వత రిజిస్ట్రేషన్ ఇంకెప్పుడు? అని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్లయితే తాత్కాలిక రిజిస్ట్రేషన్ల (టెంపరరీ రిజిస్ట్రేషన్-టీఆర్)లోనూ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో కొత్తగా వాహనం కొనుగోలు చేస్తే.. తాత్కాలిక రిజిస్ట్రేషన్ మాత్రమే షోరూంల్లో జరిగేది. నెల రోజుల్లోపు స్లాట్ బుక్ చేసుకొని.. శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం వాహనాన్ని తీసుకొని సంబంధిత రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో షోరూమ్‌ల్లో, రవాణా శాఖ కార్యాలయాల్లో ప్రక్రియలో ఆలస్యం జరిగేది. అదనపు వసూళ్లతో వాహనదారులు ఇబ్బందులు పడేవారు. వీటికి చెక్ పెట్టేందుకు కొత్త వాహనాల తాత్కాలిక రిజిస్ట్రేషన్, శాశ్వత రిజిస్ట్రేషన్ సహా యాజమాన్య బదిలీ, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, సరుకు, ప్యాసింజర్ వాహనాలకు పర్మిట్లు, రహదారి పన్ను చెల్లింపు వంటి సేవలను కేంద్ర ప్రభుత్వ పోర్టల్ అయిన ‘పరివాహన్’కు అనుసందానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు గత నెల 23న రాష్ట్రంలో ‘వాహన్’ సేవలను రవాణాశాఖ మంత్రి పొన్నం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ఇక రవాణా శాఖ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని, వాహనాలను కొనుగోలు చేసిన షోరూంల్లోనే తాత్కాతిక, శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఫలితంగా కొత్తగా కార్లు, ద్విచక్రవాహనాలు కొనుగోలు చేసినవారు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. నూతన విధానం ప్రకారం వాహనాల తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్లు షోంరూల్లోనే జరగాలి. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం తాత్కాలిక రిజిస్ట్రేషన్ జరిగిన మూడు, నాలుగు రోజుల్లోపు శాశ్వత రిజిస్ట్రేషన్ నంబరు వాహనదారుడి ఫోన్ నంబరుకు సందేశం రూపంలో వస్తుంది. అదే సమాచారం డీలర్లకూ వెళ్తుంది. నంబర్ ప్లేట్ కూడా షోరూంలకు వస్తుంది. ఫోన్‌కు వచ్చిన సందేశాన్ని చూసుకొని వాహనదారుడు షోరూంకు వెళితే అక్కడే నంబర్ ప్లేట్ అమరుస్తారు. ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 1500 ల్లోపు వాహనాలకు మాత్రమే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్లు జారీ అయ్యాయని సమాచారం. వాస్తవంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 1300-1500 వరకు వాహనాల కొనుగోళ్లు జరుగుతుండటం గమనార్హం.
‘హైపొతికేషన్’ వాహనాలకే సమస్య?
గ్రేటర్‌లో మెజారిటీ పౌరులు బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి రుణాలు తీసుకొని వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇలాంటి వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ హైపొతికేషన్ (రుణం ఇచ్చిన సంస్థలో తాకట్టు) విధానంలో జరుగుతుంది. ఇందుకు వాహనదారులు అదనంగా కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం హైపొతికేషన్‌లో కొనుగోలు చేసిన వాహనాల రుసుములో వ్యత్యాసం వస్తోంది. ‘వాహన్’లో చూపుతున్న విఽధంగా వాహనదారుడి వద్ద డీలర్లు రుసుము వసూలు చేస్తుండగా.. రవాణా శాఖ కార్యాలయాల్లో మాత్రం రూ.500 నుంచి రూ.1000 వరకు ఫీజు పెండింగ్‌లో ఉన్నట్టు చూపుతోంది. దీంతో రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి లేకుండా పోతోంది. రెండోసారి పిలిచి అదనంగా రుసుము చెల్లించాలని అడిగితే వాహనదారులూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. హిమాయత్‌నగర్‌లోని ఓ షోరూంలో పూర్తిగా డబ్బులు చెల్లించి ఓ వ్యక్తి వాహనం కొనుగోలు చేశాడు. 15 రోజులైనా ఇప్పటికీ శాశ్వత రిజిస్ట్రేషన్ జరుగలేదు. హబ్సిగూడలోని షోరూంలో మూడు వారాల క్రితం ఓ వ్యక్తి, బ్యాంకు నుంచి రుణం తీసుకొని వాహనం కొనుగోలు చేశాడు. ఇప్పటికీ శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తికాలేదు. ఇదిలా ఉంటే.. హ్యాండ్లింగ్ చార్జీల పేరిట కొందరు డీలర్లు అదనపు వసూళ్లు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించారని వాహన్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లు బ్లాక్ చేసిన షోరూంల్లోనూ వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి.