Share News

రెండో రోజూ మొరాయించిన వాహన్‌-సారథి

ABN , Publish Date - Jun 17 , 2026 | 05:09 AM

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ రవాణా శాఖ(ఆర్టీవో) కార్యాలయాల్లో వరుసగా రెండో రోజూ పౌర సేవలు స్తంభించాయి.

రెండో రోజూ మొరాయించిన వాహన్‌-సారథి

  • సాయంత్రానికి సాధారణ స్థితికి.. సేవల పునరుద్ధరణ

  • సామర్థ్యానికి మించిన లావాదేవీల వల్లే తరచూ సమస్యలు

  • రాష్ట్రంలో రెండు రోజుల్లో 30 వేల మందికి ఇబ్బందులు

హైదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ రవాణా శాఖ(ఆర్టీవో) కార్యాలయాల్లో వరుసగా రెండో రోజూ పౌర సేవలు స్తంభించాయి. ‘వాహన్‌-సారథి’ పోర్టల్‌లో మంగళవారం కూడా సాంకేతిక సమస్యలు కొనసాగాయి. ఫలితంగా వేలాది మంది వాహనదారులు, దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు సాయంత్రానికి పోర్టల్‌ అందుబాటులోకి రావడంతో సేవలను పునరుద్ధరించారు. డిజిటల్‌ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ‘వాహన్‌-సారఽథి’ పోర్టల్‌తో తెలంగాణ రవాణా శాఖ ఇటీవల అనుసంధానమైన విషయం తెలిసిందే. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా సోమవారం ఉదయం నుంచే పోర్టల్‌ సేవలు నిలిచిపోయాయి. సోమవారం సాయంత్రం వరకూ సమస్య పరిష్కారమవుతుందని భావించినా... అలా జరగలేదు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సేవలకు సంబంధించి సోమవారం 25 వేలపైగా స్లాట్లు బుక్‌ కాగా, వారందరి స్లాట్లను మంగళవారానికి రీషెడ్యూల్‌ చేశారు. కానీ, మంగళవారం కూడా సేవలు నిలిచిపోవడంతో ఆర్టీఏ కార్యాలయాల్లో రద్దీ నెలకొంది. మధ్యాహ్నం తర్వాత కొంత సమయం పాటు సర్వర్‌ పనిచేసినా... ఆ తర్వాత కాసేపటికే తిరిగి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సేవలు నెమ్మదించాయి. సాయంత్రానికి పోర్టల్‌ సేవలు పునరుద్ధరించడంతో.. అన్ని కార్యాలయాలు కిటకిటలాడాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ బీటెక్‌ విద్యార్థి శాశ్వత లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోగా.. సోమ, మంగళవారాల్లో నాగోలు ఆర్టీవో కార్యాలయం వద్దే పడిగాపులు కాయాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 35 వేల మంది ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నారు. కాగా, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని రవాణా శాఖల సేవలను ఒకే గొడుకు కిందకు తెస్తూ కేంద్రం క్లౌడ్‌ డేటాబే్‌సను రూపొందించింది. దేశవ్యాప్తంగా ప్రతి రోజూ సగటున రెండున్నర కోట్ల లావాదేవీలను తట్టుకునేలా దీన్ని రూపొందించారు. అయితే, రద్దీ సమయంలో సాధారణ పరిమితి కంటే నాలుగు రెట్లు ఎక్కువగా లాగిన్లు నమోదవుండడంతో వెబ్‌సైట్‌ త రచూ మొరాయిస్తోంది. సర్వర్‌లో సాంకేతిక సమస్యల కారణంగానే ఇబ్బందులు తలెత్తుతున్నాయని, తమ పరిధిలో చేసేదేమీ లేదని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.

Updated Date - Jun 17 , 2026 | 05:09 AM