భూమి సర్వే కోసం రూ.20 వేలు లంచం
ABN , Publish Date - May 27 , 2026 | 05:31 AM
భూమి సర్వే కోసం రైతును రూ.20 వేలు లంచం డిమాండ్ చేసిన ఓ మండల సర్వేయర్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.
ఏసీబీకి చిక్కిన వడ్డేపల్లి సర్వేయర్
వడ్డేపల్లి, మే 26 (ఆంధ్రజ్యోతి): భూమి సర్వే కోసం రైతును రూ.20 వేలు లంచం డిమాండ్ చేసిన ఓ మండల సర్వేయర్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. వడ్డేపల్లి మండలానికి చెందిన ఒక రైతు తన 4 ఎకరాల పొలాన్ని సర్వే చేయాలని కోరగా, ఎకరాకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.20 వేలు ఇవ్వాలని సర్వేయర్ బ్రహ్మయ్య డిమాండ్ చేశాడు. సర్వే కోసం రైతుపై ఒత్తిడి తెచ్చి గతంలోనే అడ్వాన్స్‌గా రూ.5 వేలు తీసుకున్నాడు. మిగిలిన సొమ్ము ఇస్తేనే సర్వే చేస్తానని మొండికేయడంతో బాధిత రైతు మహబూబ్‌నగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ సారథ్యంలో అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం వడ్డేపల్లి కార్యాలయంలో నిఘా పెట్టారు. మంగళవారం రైతు నుంచి సర్వేయర్ బ్రహ్మయ్య మిగిలిన సొమ్ములో రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.