బలహీన వర్గాల గొంతుక వీహెచ్
ABN , Publish Date - May 20 , 2026 | 03:36 AM
బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆరు దశాబ్దాలుగా కృషి చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు (వీహెచ్) సేవలు అభినందనీయమని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు.
ప్రభుత్వ సలహాదారు కావడం హర్షణీయం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
కాంగ్రెస్‌కు విధేయుడు వీహెచ్: మంత్రి దుద్దిళ్ల
రవీంద్రభారతిలో వీహెచ్‌కు ఆత్మీయ సత్కారం
రవీంద్రభారతి, మే 19 (ఆంధ్రజ్యోతి): బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆరు దశాబ్దాలుగా కృషి చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు (వీహెచ్) సేవలు అభినందనీయమని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. రాజకీయాల్లో ఎంత ఎదిగినా, ఒదిగి ఉండాలనే సిద్ధాంతాన్ని పాటించిన నాయకుడని కొనియాడారు. రవీంద్రభారతిలో మంగళవారం ఆదర్శ ఫౌండేషన్, శృతిలయం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావును ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా స్పీకర్ ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ బలహీన వర్గాల గొంతుక అయిన హనుమంతరావు.. క్యాబినెట్ హోదాలో ప్రభుత్వ సలహాదారుగా నియమితులు కావడం సంతోషంగా ఉందన్నారు. 50ఏళ్లుపైగా కాంగ్రెస్‌లో కొనసాగడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ వి.హనుమంతరావుకు ప్రభుత్వ సలహాదారు పదవి దక్కడం హర్షణీయమన్నారు. తప్పును తప్పు అనడంలో హనుమంతరావు ముందుంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడని అభివర్ణించారు. ఇకముందు కూడా ఓబీసీల వెంట ఉండాలని, ఎలాంటి సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న హనుమంతరావును సత్కరించుకోవడం అభినందనీయమన్నారు. సన్మానగ్రహీత వి.హనుమంతరావు మాట్లాడుతూ ఆత్మీయ సత్కారం చేసిన మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సేవ చేయాలన్న లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. అట్టడువర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నానన్నారు.