Share News

ధాన్యం దిగుబడి పెరిగినా కేంద్రం కోటాల్లో కోతా?

ABN , Publish Date - Apr 10 , 2026 | 05:32 AM

రాష్ట్రంలో వరి ఉత్పత్తి గణనీయంగా పెరిగినా, కేంద్రం కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌), బాయిల్డ్‌ రైస్‌ లక్ష్యాలను తగ్గిస్తుండటంతో..

ధాన్యం దిగుబడి పెరిగినా కేంద్రం కోటాల్లో కోతా?

  • రాష్ట్రంపై పడుతున్న అదనపు భారం

  • కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి మంత్రి ఉత్తమ్‌ లేఖ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరి ఉత్పత్తి గణనీయంగా పెరిగినా, కేంద్రం కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌), బాయిల్డ్‌ రైస్‌ లక్ష్యాలను తగ్గిస్తుండటంతో.. రాష్ట్రప్రభుత్వంపై ఆర్థికభారం పడుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, ఇతర అధికారులు, రైస్‌మిల్లర్లతో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ, ఉత్పత్తి, సీఎంఆర్‌ లక్ష్యాలు, బియ్యం డెలివరీ సహా పలు అంశాలపై చర్చించారు. సమస్యల పరిష్కారం కోరుతూ కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషికి ఆయన గురువారం లేఖ రాశారు. కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న వికేంద్రీకృత సేకరణ పథకం(డీఎ్‌సపీ) కింద రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేస్తోందని, అయితే కేంద్రం సీఎంఆర్‌ లక్ష్యాలను తగ్గించటంతో అధిక నిల్వలు పెరిగి గోదాముల నిర్వహణ ఖర్చులు, మిల్లింగ్‌ వ్యయం, వడ్డీ భారం రాష్ట్రంపై పడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఎఫ్‌సీఐకి సరఫరా చేసే బాయిల్డ్‌ రైస్‌ 2024-25లో 66.78 శాతానికే పరిమితమైందని తెలిపారు. లక్షలాది మంది రైతులు వరి పంటపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్రం సహకరించాల్సిన అవసరం ఉందని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ముగిసిన సీఎంఆర్‌ గడువును మరో 60 రోజులు పొడిగించాలని కోరారు.

Updated Date - Apr 10 , 2026 | 05:32 AM