హరీశ్.. కాళేశ్వరం ముడుపుల్లో నీ వాటా ఎంతో చెప్పు
ABN , Publish Date - Aug 06 , 2026 | 06:13 AM
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ కాంట్రాక్టర్ల నుంచి అందుకున్న రూ.1,400 కోట్ల ముడుపుల్లో తన వాటా ఎంతో హరీశ్‌రావు బయటపెట్టాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.
కట్టుకథలతో బట్ట కాల్చి మీద వేయడం మానేయ్..
ఏపీ ప్రాజెక్టులకు పరోక్ష మద్దతు ఇచ్చిందే మీరు : మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, ఢిల్లీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ కాంట్రాక్టర్ల నుంచి అందుకున్న రూ.1,400 కోట్ల ముడుపుల్లో తన వాటా ఎంతో హరీశ్‌రావు బయటపెట్టాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇకనైన కట్టు కథలతో బట్ట కాల్చి మీద వేయడం మానెయ్యాలని హరీశ్‌రావుకు ఒక ప్రకటనలో హితవు పలికారు. రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును నిండా ముంచి సిగ్గు లేకుండా రాజకీయాలు చేస్తావా? అంటూ మండిపడ్డారు. తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ ప్రాజెక్టుల ప్రయోజనాలను ఏనాడూ పట్టించుకోని బీఆర్‌ఎస్ నేతలు, అధికారం కోల్పోగానే కడుపు మంటతో మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. గత 12 ఏళ్లుగా ప్రతి బోర్డు సమావేశంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూనే ఉందని, అందులో కొత్త విషయం ఏమీ లేదన్నారు. బీఆర్‌ఎస్ నేతలు ఏపీ ప్రాజెక్టులకు పరోక్షంగా మద్దతు ఇచ్చి, ఇప్పుడు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తొమ్మిదిన్నరేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ఏనాడూ తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేదని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు పనులు, పట్టిసీమ పూర్తయింది బీఆర్‌ఎస్ హయాంలో కాదా? అని ప్రశ్నించారు. ‘‘తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రాలేమని తెలిసి, ఏపీతో కుమ్మక్కయి నాగార్జున సాగర్ ప్రాజెక్టును వివాదం చేసింది మీరు కాదా?’’ అని నిలదీశారు.
ఈ నెల 18నగోదావరి బోర్డు అజెండాలో ఉంచిన అంశాలు కొత్తవేమీ కాదన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం సాంకేతిక సలహా మండలి(టీఏసీ) అనుమతులు, 67 టీఎంసీల నీటి కేటాయింపులు సాధించేలా ఈ ప్రభుత్వం చొరవ తీసుకుందని మంత్రి ఉత్తమ్ వివరించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం, సమ్మక్కసాగర్(తుపాకులగూడెం), చిన్న కాళేశ్వరం(ముక్తేశ్వర్), చనాకా-కొరటా, మొండికుంటవాగు, గూడెంలిఫ్ట్ తదితర ఏడు ప్రాజెక్టుల అనుమతులు ఇవ్వరాదని ఏపీ కోరుతూ వచ్చిందని, సాంకేతిక అనుమతులు వచ్చాక కూడా సమీక్షించాలని ప్రస్తావిస్తోందని చెప్పారు. దీన్ని ప్రతిఘటించి, రాష్ట్ర నీటి హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం సఫలీకృతమయిందన్నారు. ఇక సమ్మక్కసాగర్ ప్రాజెక్టు ఎన్‌వోసీ కోసం మూడు సార్లు ఛత్తీస్‌గఢ్ సీఎంను కలిశామని.. అది ఈ నెలాఖరులోగా వస్తుందన్నారు. ఆర్డీఎస్ ఆధునీకరణపై ఏపీ, కర్ణాటక సీఎంలను ఒప్పించామని చెప్పారు. పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రితోపాటు, తాను, అధికారులు వివిధ సందర్భాల్లో 19 సార్లు లేఖలు రాశామని చెప్పారు.