Share News

సాగునీటి సంస్థల బలోపేతానికి కొత్త కార్యాచరణ

ABN , Publish Date - Jul 20 , 2026 | 03:30 AM

రాష్ట్రంలోని సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు అధిక వడ్డీ రుణాల భారాన్ని తగ్గించి...

సాగునీటి సంస్థల బలోపేతానికి కొత్త కార్యాచరణ

  • 10 రోజుల్లో ఫండింగ్‌ రోడ్‌మ్యాప్‌: మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌, జూలై 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు అధిక వడ్డీ రుణాల భారాన్ని తగ్గించి... తక్కువ వడ్డీతో నిధులు సమీకరించేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం కుందన్‌బాగ్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సాగునీటి సంస్థల ఆర్థిక పరిస్థితిపై నిర్వహించిన ప్రత్యేక సమీక్షలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే పది రోజుల్లో సమగ్ర ఫండింగ్‌ రోడ్‌మ్యా్‌పను సిద్థం చేసి సమర్పించాలని... బడ్జెట్‌ నిధులపై పూర్తిగా ఆధారపడకుండా సంస్థలకు స్థిరమైన ఆదాయ వనరులను అభివృద్థి చేసే మార్గాలపై దృష్టి పెట్టాలని సూచించారు. రుణాల పునర్వ్యవస్థీకరణ ద్వారా అధిక వడ్డీ భారాన్ని తగ్గిస్తే ప్రభుత్వానికి భారీగా ఆదా అవుతుందన్నారు. సాగునీటి సంస్థల ఆధీనంలోని భూముల్లో సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని, రైతులపై అదనపు భారం లేకుండా కొత్త ఆదాయ వనరులను సృష్టించాలన్నారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన రుణాలు, నిధుల లభ్యత, పనుల పురోగతిపై సమగ్ర నివేదికను సిద్థం చేయాలని ఆదేశించారు. తక్కువ పెట్టుబడితో త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని, శాఖకు చెందిన భూములు, ఇతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లో సిద్థం చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న చట్టబద్ధ ఆడిట్లను పూర్తి చేయాలని... భూసేకరణ పరిహారాన్ని రైతులకు ఆలస్యం లేకుండా చెల్లించాలని మంత్రి ఆదేశించారు.

Updated Date - Jul 20 , 2026 | 03:30 AM