Share News

లోపాలు దాచి బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారం

ABN , Publish Date - Jul 06 , 2026 | 03:35 AM

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మాణ లోపాలను దాచి ప్రజలు, రైతులను తప్పుదోవ పట్టించేలా బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.

లోపాలు దాచి బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారం

  • బ్యారేజీల పునాదుల్లో లోపాలున్నట్లు ఎన్డీఎస్‌ఏ చెప్పింది

  • ‘కన్నెపల్లి’ నుంచి నీటి ఎత్తిపోత అసాధ్యం: ఉత్తమ్‌

  • బీఆర్‌ఎస్‌ తప్పిదాలతోనే ‘కూలేశ్వరం’: పొంగులేటి

హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మాణ లోపాలను దాచి ప్రజలు, రైతులను తప్పుదోవ పట్టించేలా బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రాజెక్టును రాజకీయ ప్రచార సాధనంగా మార్చి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఘనత ఆ పార్టీదేనని మండిపడ్డారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ ద్వారా నీటిని ఎత్తిపోయవచ్చంటూ బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ‘‘పంపులు ఆన్‌ చేయడం సాధ్యం కాదు... అసలు చేయలేం. శాస్ర్తీయ పునరుద్ధరణ పూర్తయ్యే వరకూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిధిలో నీటి నిల్వ చేయరాదని జాతీయ డ్యామ్‌ భద్రతా సంస్థ స్పష్టంగా ఆదేశించింది. మూడు బ్యారేజీల పునాదుల్లో తీవ్రమైన నిర్మాణ లోపాలు ఉన్నట్లు తేల్చింది’’ అని స్పష్టం చేశారు. కాళేశ్వరం సమస్యను రాజకీయ కోణంలో కాకుండా ఇంజినీరింగ్‌ కోణంలో చూడాలని సూచించారు. ఇది ఒక్క పిల్లర్‌ సమస్య కాదు... ఒక్క గేట్‌ సమస్య కాదు.. మొత్తం మేడిగడ్డ బ్యారేజీ పునాది వ్యవస్థ సమగ్రతకు సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు. లోపాలను సరిచేయకుండా నీటిని నిల్వ చేస్తే భద్రాచలం సహా దిగువ ప్రాంతాలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడదని స్పష్టం చేశారు. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూపొందించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును అమలు చేసి ఉంటే ఉత్తర తెలంగాణకు గ్రావిటీ ద్వారా 80 టీఎంసీల స్థిర నీటి భద్రత లభించి ఉండేదని ఉత్తమ్‌ తెలిపారు. ఆ ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చి.. ఉత్తర తెలంగాణ భవిష్యత్తుతో బీఆర్‌ఎస్‌ ఆటలాడిందని విమర్శించారు. స్వార్థం, అత్యాశ, సాంకేతికతో రాజీ ఫలితమే నేటి కాళేశ్వరం సంక్షోభమని వ్యాఖ్యానించారు. మూడు బ్యారేజీల్లో గ్రౌండ్‌ పెనిట్రేటింగ్‌ రాడార్‌ సర్వేలు, 80 మీటర్ల లోతు వరకు బోర్‌ హోల్స్‌, హైడ్రాలిక్‌ మోడలింగ్‌, కంప్యూటేషనల్‌ ఫ్లూయిడ్‌ డైనమిక్స్‌, డిజిటల్‌ ట్విన్‌ సిమ్యులేషన్లు వంటి అత్యాధునిక పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుత వర్షాకాలంలో డిజైన్లను ఖరారు చేసి, వరదలు తగ్గిన వెంటనే బ్యారేజీల పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆగస్టు 2027 నాటికి పనులు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. శాస్ర్తీయ పునరుద్ధరణ పూర్తయి, ఎన్‌డీఎ్‌సఏ, సీడబ్ల్యూసీ అనుమతులు వచ్చిన తర్వాతే మూడు బ్యారేజీలు నిర్వహణలోకి వస్తాయని స్పష్టం చేశారు. కాళేశ్వరం పునరుద్థరణతో పాటు తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా 80 టీఎంసీల నీటిని తెలంగాణకు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలను వేగవంతం చేసిందని తెలిపారు.

Updated Date - Jul 06 , 2026 | 03:35 AM