Share News

భూగర్భ జలాల సంరక్షణకు పటిష్ఠ చర్యలు

ABN , Publish Date - May 16 , 2026 | 05:10 AM

భూగర్భ జలాల సంరక్షణకు, ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

భూగర్భ జలాల సంరక్షణకు పటిష్ఠ చర్యలు

  • ఫ్లోరైడ్‌, నైట్రేట్‌ వంటి సమస్యాత్మక అంశాలపై ప్రత్యేక దృష్టి

  • నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): భూగర్భ జలాల సంరక్షణకు, ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రధానంగా భూగర్భంలో ఫ్లోరైడ్‌, నైట్రేట్‌ వంటి లవణాలు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామన్నారు. శుక్రవారం సచివాలయంలో భూగర్భ జలశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో భూగర్భ జలాల సంరక్షణ అత్యంత ప్రాధాన్యమైన అంశమని, ఈ విషయంలో రైతులకు ప్రత్యేకంగా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. నీటి సమర్థ వినియోగానికి, వృథాగా పోయే నీటిని నియత్రించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. 2024తో పోల్చితే 2025లో భూగర్భ జలాల వినియోగం 45.93 శాతం నుంచి 46.86 శాతానికి పెరిగిన విషయాన్ని ప్రస్తావించారు. భూగర్భ జలాల సంరక్షణను ఒక ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పెద్ద సంఖ్యలో చేపట్టాలన్నారు. జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టు అమలులో ఉత్తమ పనితీరు కనబర్చిన శాఖల్లో తెలంగాణ గ్రౌండ్‌ వాటర్‌ విభాగం ఒకటిగా గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు. ఇకపై భూగర్భ జలాల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కృత్రిమ మేధను ఉపయోగించాలన్నారు. జిల్లా కలెక్టర్లు భూగర్భ జలాల వినియోగం, రీచార్జ్‌ పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలన్నారు. భూగర్భ జలాల అధిక వినియోగ ప్రాంతాలుగా గుర్తించిన గ్రామాల్లో కొత్త బోర్‌వెల్‌ తవ్వకాలను నియంత్రించాలని మంత్రి ఆదేశించారు. 16 జిల్లాల్లో భూగర్భ జలాలపై ఒత్తిడి అధికంగా ఉందని, హైదరాబాద్‌ జిల్లాలోనే 8 మండలాలు అధిక వినియోగ కేటగిరిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇసుక తవ్వకాల అనుమతులకు ముందు భూగర్భ జలాల శాఖతో సంప్రదించాల్సిన అవసరంపెనా చర్చించారు. భూగర్భ జలాలు పెంచడానికి భూగర్భ జల శాఖ, నీటిపారుదల, పంచాయతీరాజ్‌, పరిశ్రమల శాఖల మధ్య మరింత సమన్వయం ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.

Updated Date - May 16 , 2026 | 05:10 AM