Minister Uttam Kumar Reddy: కేసీఆర్ నిర్ణయాలు ప్రాజెక్టులకు మరణశాసనం
ABN , Publish Date - Jan 04 , 2026 | 05:21 AM
కేసీఆర్ నిర్ణయాలు కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు మరణశాసనంగా మారాయని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు.....
35 శాతం పనులు చేసి.. 90 శాతం పూర్తయ్యాయని చెబుతారా?
రాయలసీమ ఎత్తిపోతలపై అప్పటి ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కు
గోదావరితో రాయలసీమను రతనాల సీమగా మార్చుతామనలేదా?
జలవివాదాల పరిష్కారానికి ఎవరితోనైనా చర్చిస్తాం
మూడేళ్లలోపు కృష్ణాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం: ఉత్తమ్
హైదరాబాద్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ నిర్ణయాలు కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు మరణశాసనంగా మారాయని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు, పనుల విషయంలో అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు కేసీఆర్ పూర్తి సహకారం అందించారని విమర్శించారు. 2019లో ప్రగతిభవన్‌లో పలు సమావేశాలు జగన్‌తో నిర్వహించి, గోదావరి జలాలను రాయలసీమకు తీసుకెళ్లి రతనాల సీమగా మార్చుతామని చెప్పలేదా? అని నిలదీశారు. శనివారం శాసనసభలో కృష్ణా, గోదావరి జలాలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా మంత్రి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రానున్న మూడేళ్లలోపు కృష్ణా బేసిన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, కృష్ణా జలాల్లో తెలంగాణకు 71 శాతం నీటి వాటా కావాలని ట్రైబ్యునల్‌ను వాదనలు వినిపిస్తున్నామని పేర్కొన్నారు. పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. నిన్న గాక మొన్న ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ ఆమోదం వచ్చిందన్నారని, అసలు ఆ ప్రాజెక్టుకు అనుమతియే రాలేదన్నారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశామని, ఈనెల 5న సుప్రీంకోర్టు సీజే ముందు విచారణ కు రానుందని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాలకు సంబందించి తెలంగాణ ప్రయోజనాలను బీఆర్‌ఎస్ తాకట్టుపెట్టిందని, తాము ఆ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
నదీ జలాల వివాదాలను పరిష్కారం చేసుకోవడానికి ఎవరితో మాట్లాడటానికైనా సిద్ధంగా ఉన్నామని. ఒక్క చుక్కనీటినీ వదులుకోబోమని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మాట్లాడుతూ రానున్న మూడేళ్లలో పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ, డిండి ఎతల్తిపోతల, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రకటించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2014లో ఆగస్టు 1న రూ.27 వేల కోట్లతో పరిపాలన అనుమతి లభించిందని.. అయితే ఆ తర్వాత చేపట్టిన కాళేశ్వరానికి రూ.89,794 కోట్లు వెచ్చిస్తే... పాలమూరులో రూ.26 వేల కోట్లు మాత్రమే వెచ్చించారని విమర్శించారు. కాళేశ్వరంలో అవసరం లేకున్నా కమీషన్ల కోసం అదనంగా ఒక టీఎంసీ పనుల కోసం రూ.27 వేల కోట్లు కేటాయించారని విమర్శించారు. ఈ రూ.27వేల కోట్లతో కృష్ణా పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి తీసుకోవడానికి 2017లో టీవోఆర్ జారీ అయితే... 2021లో బహిరంగ విచారణ చేపట్టి, 2022లో డీపీఆర్ దాఖలు చేశారని.. అదే కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను 2017లోనే ఎందుకు దాఖలు చేశారని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి జూరాల నుంచి చేపడితే రూ.32 వేల కోట్లతో ప్రాజెక్టు పూర్తయ్యేదని, శ్రీశైలం నుంచి చేపట్టడం వల్ల రూ.84,622 కోట్లు వెచ్చిస్తే తప్ప ప్రాజెక్టు పూర్తి కాని పరిస్థితి నెలకొందన్నారు. ప్రాజెక్టు కోసం ఇంకా 39 వేల ఎకరాలను సేకరించాల్సి ఉందన్నారు. బీఆర్‌ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో గోదావరి బేసిన్‌లోని భారీ ప్రాజెక్టులకు రూ.1,24,608.65 కోట్లు వెచ్చిస్తే.. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు రూ.41,372..97 కోట్లు వెచ్చించారని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 75 శాతం డిపెండబుల్టీ (నాలుగేళ్లలో కచ్చితంగా మూడేళ్లు వచ్చే వరద) ఆధారంగా 555 టీఎంసీలు, పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు తరలించే 45 టీఎంసీలు కలిపి... కోరుతున్నామని, ఆరేడునెలల్లో ట్రైబ్యునల్ తీర్పు రానుందన్నారు.
2027 నాటికి చనాక-కొరాట బ్యారేజీ పనులు పూర్తి
చనాక-కొరాట బ్యారేజీ పనులను 2027 డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఉత్తర తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విజ్ఞప్తి మేరకు చనాక-కొరాట బ్యారేజీ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. వారం రోజుల్లో ఆదిలాబాద్ జిల్లా సదర్‌మాట్ బ్యారేజీ వద్దకు సీఎం రేవంత్‌రెడ్డి, తాను వస్తున్నామని, అక్కడే ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని ఆయన తెలిపారు.