Share News

ఉట్నూర్‌ ఏటీసీలో అద్భుత ఫలితాలు

ABN , Publish Date - Jun 30 , 2026 | 05:29 AM

సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు) రాష్ట్ర యువత జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నాయి.

ఉట్నూర్‌ ఏటీసీలో అద్భుత ఫలితాలు

  • ఇక్కడ శిక్షణ పొందిన వారిలో.. 99 మందికి ఎంఎన్‌సీల్లో ఉద్యోగాలు

  • అత్యాధునిక శిక్షణతో యవతకు కొలువులు

  • సీఎం రేవంత్‌ సంకల్పానికి తొలి విజయం

  • త్వరలో వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లోనూ ఇదే తరహా భారీ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు) రాష్ట్ర యువత జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నాయి. నైపుణ్యాలే భవిష్యత్తుకు పునాది అనే యోచనతో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు అనతికాలంలోనే అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ ప్రభుత్వ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ) సాధించిన విజయం యావత్‌ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు చెందిన యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆశయానికి ఈ కేంద్రం ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థుల్లో ఏకంగా 99 మంది ప్రముఖ మల్టీనేషనల్‌ కంపెనీ(ఎంఎన్‌సీ)ల్లో ఉద్యోగాలు సాధించడం విశేషం. తెలంగాణలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్యక్రమాలు సరైన దిశలో సాగుతున్నాయనడానికి ఉట్నూర్‌ విజయగాథే ఒక స్పష్టమైన ఉదాహరణ. పక్కా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పుట్టి, పరిమిత వనరులతో చదువుకున్న ఈ విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్థి చెందిన మల్టీనేషనల్‌ కంపెనీలు నేరుగా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ద్వారా ఎంపిక చేసుకున్నాయి. ఇందులో ప్రముఖ సంస్థ ‘ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌’ 47 మందికి, ‘టాటా మోటార్స్‌’ 36 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాయి. వీటితో పాటు బెంగళూరులోని ‘ఫాక్స్‌కాన్‌’ 14 మంది యువతులను ఉద్యోగాలకు ఎంపిక చేసింది. మంచి ప్యాకేజీలతో ప్రముఖ నగరాల్లో ఉద్యోగాలు లభించడంతో ఆయా విద్యార్థుల కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురించాయి. తెలంగాణను దేశంలోనే ‘స్కిల్‌ క్యాపిటల్‌’గా తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్‌ రెడ్డి సంకల్పానికి ఉట్నూర్‌ ఏటీసీ తొలి విజయకేతనంగా నిలిచింది.

మరిన్ని ఏటీసీల ద్వారా ఉద్యోగాలు!

రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న మరిన్ని ఏటీసీల ద్వారా వేలాది మంది యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. ఉట్నూర్‌ స్ఫూర్తితో త్వరలోనే వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లోనూ ఇదే తరహా భారీ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి ఉద్యోగ మేళాలు నిర్వహించి, పెద్ద ఎత్తున స్థానిక యువతకు ఉపాధి కల్పించనున్నారు. రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్‌-2047’ విజన్‌ కింద ఈ భారీ ఉద్యోగ కల్పన కార్యక్రమాలను అనుసంధానించారు. ఇందులో భాగంగా పరిశ్రమలు, ప్రము ఖ కార్పొరేట్‌ సంస్థలు, శిక్షణ కేంద్రాలు, అప్రెంటి్‌సషిప్‌ సంస్థలు, ప్రభుత్వ శాఖలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ మెగా జాబ్‌ మేళాలు నిర్వహించనున్నారు. ప్రతిభకు ప్రాంతంతో పనిలేదని నిరూపిస్తూ ప్రజాప్రభుత్వం ఐటీ, పారిశ్రామిక రంగాలలో సరికొత్త విప్లవానికి తెరతీసింది.

Updated Date - Jun 30 , 2026 | 05:29 AM