యాప్‌లో బుకింగ్.. షాప్‌లో స్టాక్ నిల్!
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:19 AM
యూరియా పక్కదారి పడుతోందని రైతులు వ్యవసాయ శాఖ యాప్‌లో బుక్ చేస్తేనే ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. వారం రోజులుగా ఊరించి ఎట్టకేలకు సోమవారం...
యూరియా కోసం కష్టాలు
తాండూరు, జూన్ 8 (ఆంధ్రజ్యోతి) : యూరియా పక్కదారి పడుతోందని రైతులు వ్యవసాయ శాఖ యాప్‌లో బుక్ చేస్తేనే ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. వారం రోజులుగా ఊరించి ఎట్టకేలకు సోమవారం ఆ యాప్‌ను అమలులోకి తీసుకొచ్చారు. దీంతో వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి తండాకు చెందిన రైతులు దేవ్లిబాయి, లక్ష్మీబాయి తదితర రైతులు యాప్‌లో అంబురామేశ్వర ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ పేరిట ఒక్కొక్కరికి రెండు బస్తాల యూరియా చొప్పున బుక్ చేసుకున్నారు. ఇంటర్‌నెట్ సెంటర్ దగ్గర గంటల తరబడి వేచి ఉండి యూరియా బుక్ చేసుకున్న ఆ రైతులు తీరా ఆటో తీసుకొని దుకాణానికి వెళ్తే అక్కడ స్టాక్ లేదు. దుకాణం వాళ్లు తమకు యూరియాను కేటాయించలేదని చేతులెత్తేశారు. దీంతో కందనెల్లి తండాకు చెందిన నాయకుడు జయసింగ్ వ్యవసాయ అధికారులను, దుకాణదారులను నిలదీశారు. అధికారులు అందుకు సరైన సమాధానం చెప్పకుండా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తొలకరి వర్షాలతో తీరిక లేకుండా ఉండే రైతులు రోజంతా యాప్ బుకింగ్ కోసం గంటల తరబడి వేచి ఉన్నా తర్వాత స్టాక్ లేదనడంతో ఆందోళన చెందుతున్నారు.