పట్టణ ఓటర్లు 1.32లక్షలు
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:38 AM
పురపాలక ఎన్నికలకు జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం మునిసిపాలిటీ ల వారీగా ఓటర్ల తుది జాబితాను ప్రకటించా రు. జిల్లాలో మొత్తం ఆరు మునిసిపాలిటీల్లో 104 వార్డులు ఉన్నాయి.
పురుషులు 64,937, మహిళలు 67,770
తుదిఓటర్ల జాబితాను ప్రకటించిన అధికారులు
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): పురపాలక ఎన్నికలకు జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం మునిసిపాలిటీ ల వారీగా ఓటర్ల తుది జాబితాను ప్రకటించా రు. జిల్లాలో మొత్తం ఆరు మునిసిపాలిటీల్లో 104 వార్డులు ఉన్నాయి. మొత్తం 1,32,725 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 64,937 మంది, మహిళలు 67,770 మంది, ఇతరులు 18మంది ఉన్నారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 10న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదలచేసిన అధికారులు ఈ నెల 11న వాటిపై వచ్చి న అభ్యంతరాలను పరిష్కరించి, తుది జాబితా ను సోమవారం విడుదల చేశారు. 2025 అక్టోబరు 1వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకున్న వారికే ఓటు హక్కుకు అవకాశం కల్పించారు. ఓటర్ల ముసాయిదా జాబితాల్లో పలు తప్పులు దొర్లినట్టు ఫిర్యాదులు అందాయి. ఒక వార్డులోని వారు మరో వార్డులో, మరికొందరి పేర్లు రెండు, మూడు వార్డుల్లో నమోదైనట్లుగా గుర్తించారు. మరోవైపు జాబితాలో ఉన్న పేర్లు పోర్టల్‌లో కనిపించకపోవడంతో అయోమయానికి గురయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం అభ్యంతరాలు తెలిపే అవకాశం కల్పించింది. గుట్ట మునిసిపాలిటీలో 44 అభ్యంతరాలు, ఆలేరులో 2,చౌటుప్పల్‌లో 10, భువనగిరిలో 45, భూదాన్‌పోచంపల్లిలో 16, మోత్కురులో 2 వచ్చాయి. వీటిపై అధికారులు విచారణ నిర్వహించారు. ఇప్పటికే ఎన్నికల బరిలో నిలవాలనుకునే అభ్యర్థులు ఓటుర్ జాబితాతో ఇంటింటికీ తిరుగుతూ తప్పొప్పులను గుర్తిస్తున్నారు. ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన అధికారులు పోలింగ్ కేంద్రాల గుర్తింపుపై దృష్టిసారించారు. అవసరమైతే పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచుతారు. ప్రతీ కేంద్రంలో వసతులను కమిషనర్ల్లు, సిబ్బంది పరిశీలిస్తున్నారు.
ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న నేతలు
ఓ వైపు అధికారులు మునిసిపల్ ఎన్నికలకు సన్నద్ధమవుతుండగా, ఆశావహులు మద్దతు కోసం ప్రధాన పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పట్టణాలపై పట్టు సాధించేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరగనుండటంతో అభ్యర్థులను గెలిపించాలనే లక్ష్యంతో కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ గెలుపు ధీమాతో కొద్ది రోజుల క్రితం నుంచే పావులు కదుపుతోంది. మునిసిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలంగా నిలబెట్టాలని అధికార, ప్రతిపక్ష నాయకులు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పాత, కొత్త ఆశావహులందరూ మునిసిపాలిటీల ఓటర్లతో పా టు పెద్దలు, మహిళా సం ఘాలు, యువజన సంఘా ల ప్రతినిధులను కలిసి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియలో భాగంగా జరిగిన మార్పులకు అనుగుణంగా కొందరు మహిళా స్థానాల్లో వారి సతులను అభ్యర్థిగా నిలపాలని చూస్తున్నారు. మొత్తంగా మునిసిపల్ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది.