అర్బన్ నక్సల్స్ ముద్ర వేసి..
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:23 AM
మావోయిస్టుల పట్ల సానుభూతిగా మాట్లాడేవారు, ప్రజాసమస్యలపై గళం విప్పే కవులు, కళాకారులు, మేధావులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.
రాష్ట్రంలోని పలువురు కవులు, కళాకారులు,మేధావులకు జాతీయ దర్యాప్తు సంస్థ నోటీసులు
నక్సల్ అంత్యక్రియలకు వెళ్లిన వారికి పిలుపు
గాదెఇన్నయ్య నుంచి మొదలైన అరెస్టుల పర్వం
కేంద్ర నిఘా సంస్థల దృష్టిలో200 మందికి పైనే!
సోషల్ మీడియా పోస్టులు, కామెంట్లపైనా నిఘా
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టుల పట్ల సానుభూతిగా మాట్లాడేవారు, ప్రజాసమస్యలపై గళం విప్పే కవులు, కళాకారులు, మేధావులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రాష్ట్రంలో అలా దాదాపు 200 మందికి పైగా వ్యక్తులపై నిఘా పెట్టి వారి కదలికలు, కార్యకలాపాలను గమనిస్తోందని ప్రజాసంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశం మావోయిస్టు రహితమైందని.. ఇక అర్బన్ నక్సల్స్ వంతు అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇటీవల చేసిన హెచ్చరిక నేపథ్యంలోనే ఇదంతా జరుగుతోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఒక మావోయిస్టు అంత్యక్రియల సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారన్న కారణంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కేసు నమోదు చేసి తెలంగాణలోని పలువురు మేధావులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నేతలు, కవులు, కళాకారులు తదిరులకు వరుస నోటీసులు ఇస్తున్న వైనమే ఇందుకు ఉదాహరణ అని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు ఇటీవల ఎన్‌ఐఏ జారీ చేసిన నోటీసు ఈ క్రమంలోనిదేనని స్పష్టం చేస్తున్నారు. దేశద్రోహం, ఉపా చట్టాలలోని వివిధ సెక్షన్ల కింద నమోదైన కేసుకు సంబంధించి 22వ తేదీన విచారణకు రావాలని పోటు రంగారావును ఎన్‌ఐఏ ఆ నోటీసులో కోరింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన తీగలకుంట్ల పల్లిలో జరిగిన సమయంలో పలువురు ప్రజాసంఘాల నేతలు సందర్శించి అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అలా మాట్లాడిన వారిలో ఒకరైన గాదె ఇన్నయ్య కేంద్ర హోంమంత్రిని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యల ఆధారంగా కేసు నమోదు చేసిన ఎన్‌ఐఏ.. ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ఇంకా జైలులోనే ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డిని, పౌరహక్కుల నేత గడ్డం లక్ష్మణ్, తెలంగాణ నాన్ గజిటెడ్ అధికారుల సంఘం మాజీ నాయకుడు దేవీ ప్రసాద్, రవిచందర్ తదితరులను ఎన్‌ఐఏ అధికారులు విచారించారు.
అవసరమైతే మరోసారి విచారణకు రావాలని వారికి ఎన్‌ఐఏ అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అలాగే.. గతంలో విప్లవ పార్టీల్లో పనిచేసిన వారిని, ప్రస్తుతం లీగల్ పార్టీలుగా పనిచేస్తున్న వారికి ఇప్పుడు నోటీసులు జారీ చేస్తున్నారు. మావోయిస్టు పార్టీకి సంబంధించి కానీ, లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించి కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని, వాటికి స్పందించి కామెంట్లు, లైకులు, షేర్లు చేస్తున్న వారిని నిఘా కళ్లు వెంటాడుతున్నాయని ప్రజాసంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటు సైబర్ క్రైమ్స్ విభాగాలకు చెందిన ప్రత్యేక సిబ్బంది ఈ సోషల్ మీడియా పోస్టుల ట్రాకింగ్‌ను చాలా కాలంగా చేస్తున్నారని చెబుతున్నారు.
శాతవాహన వర్సిటీలో దళితులపై వేధింపులు ఆపాలి
దళిత ప్రొఫెసర్‌ను, విద్యార్థిని అర్బన్ నక్సల్స్‌గా చిత్రీకరించొద్దు
తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ
శాతవాహన వర్సిటీలో సోషియాలజీ విభాగం అధిపతిగా ఉన్న దళిత ప్రొఫెసర్ సూరెపల్లి సుజాతను, దళిత విద్యార్థి కరికే మహేశ్‌లను అర్బన్ నక్సల్స్‌గా చిత్రీకరించి వేధించడాన్ని తక్షణమే ఆపాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ బృందం డిమాండ్ చేసింది. ఏ ఆధారాలు లేకుండా.. వారికి మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని, అర్బన్ నక్సలైట్లని కలెక్టరుకు, పార్లమెంటు సభ్యులకు కొందరు విద్యార్థులు ఫిర్యాదులు చేస్తున్నారని, వివిధ మాధ్యమాలలో అసత్య ప్రచారం చేస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో ఆందోళన వెలిబుచ్చింది. అన్ని అర్హతలు, అనుభవం ఉన్నప్పటికీ డీన్‌గా, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న దలిత మహిళా ప్రొఫెసర్‌ను తొలగించడం కక్షపూరిత చర్యేనని పేర్కొంది. ఇప్పటికైనా ఇటువంటి నిరాధార ఆరోపణలు, వేధింపులు, కక్ష పూరిత చర్యలు మానుకొని యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిని, అకడమిక్ వాతావరణాన్ని కాపాడాలని వర్సిటీ వీసీని కోరింది.