కొంతే సులభం.. చాలా కఠినం!
ABN , Publish Date - May 25 , 2026 | 04:35 AM
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం ఈసారి కష్టంగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన...
పాలనా పటిమను పరీక్షించేలా ప్రశ్నలు.. సివిల్స్ ప్రిలిమ్స్‌లో కొట్టొచ్చినట్టు మార్పులు
కష్టమంటే ఏంటో చెప్పిన ‘చరిత్ర’
అమరావతి స్తూపంపై ఒక ప్రశ్న
‘సుదర్శన చక్ర’, ఏఐ సమ్మిట్‌పై ప్రశ్నలు
సీశాట్‌లో ట్విస్టులున్నా కటాఫ్ సాధ్యమే!
ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష
దేశవ్యాప్తంగా 5.49 లక్షల మంది హాజరు
హైదరాబాద్ సిటీ, మే 24(ఆంధ్రజ్యోతి): యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం ఈసారి కష్టంగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలో అభ్యర్థుల పాలనా సామర్థ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు అడిగారు. ప్రశ్నపత్రం నిడివి ఎక్కువగా ఉందని, కొన్ని ప్రశ్నలను సుదీర్ఘంగా, తికమకపెడుతూ అడగడంతో వాటిని చదివేందుకే 5-7 నిమిషాలు పట్టిందని పలువురు అభ్యర్థులు తెలిపారు. దేశవ్యాప్తంగా 8 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకోగా 83 నగరాల్లోని 2 వేల కేంద్రాల్లో 5.49 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 29 వేలకు పైగా అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు. గత కొన్నేళ్లుగా ఇస్తున్న ప్రశ్నలతో పోల్చితే ఈసారి భిన్నంగా అడిగారు. వాస్తవాలను పరీక్షించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. చరిత్రలో అడిగిన ప్రశ్నలు మాత్రం కష్టమంటే ఏంటో తెలియజేశాయని ఎక్కువమంది చెప్పారు. చరిత్ర పరిధిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అమరావతి స్తూపంపై ప్రశ్న అడిగారు. మెయిన్స్‌లో అడిగే ఎథిక్స్‌ను ప్రిలిమ్స్‌లో జనరల్ సైన్స్ కింద ఇచ్చారని పలువురు అభ్యర్థులు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన సీశాట్ కష్టంగా ఉన్నప్పటికీ అవగాహన, సరైన ప్రాక్టీస్ ఉంటే కటాఫ్ సాధించడం ఏమంత కష్టం కాదని అభ్యర్థులే చెబుతున్నారు. సివిల్స్ జనరల్ స్టడీస్ గడిచిన మూడేళ్ళతో పోల్చుకుంటే ఈసారి చాలా వైవిధ్యంగా ఉందని లా ఎక్స్‌లెన్స్ చీఫ్ మెంటార్ కళ్యాణ్ ఐనంపూడి పేర్కొన్నారు. పరిపాలనకు సంబంధించి అభ్యర్థుల అనలిటికల్ నైపుణ్యాలను పరిశీలించేలా ప్రశ్నలు ఉన్నాయని సివిల్స్ మెంటార్ ఎం.బాలలత అభిప్రాయపడ్డారు.
విద్యార్థుల సన్నద్ధతను పరీక్షించడం కంటే.. వారిని పోటీ నుంచి తొలగించడమే లక్ష్యంగా ఈ ప్రశ్నపత్రం రూపొందించినట్లు స్పష్టంగా తెలుస్తోందని బ్రెయిన్ టీ ఇనిస్టిట్యూషన్ డైరెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. సబ్జెక్టు వారీగా పరిశీలిస్తే పాలిటీ 11, ఎకానమీ 12, జాగ్రఫీ, ఎన్విరాన్‌మెంట్ 9, సైన్స్ అండ్ టెక్నాలజీ 12, మోడ్రన్ ఇండియన్ హిస్టరీ 5, ఏన్షియంట్ హిస్టరీ 9, ఆర్ట్ అండ్ కల్చర్ 6, కరెంట్ అఫైర్స్ 15, ఇంటర్నేషనల్ రిలేషన్స్-మ్యాప్ పాయింట్ సంబంధ ప్రశ్నలు 9 సహా మరికొన్ని కూడా వచ్చాయి. కరెంట్ అఫైర్స్‌కు వెయిటేజ్ ఎక్కువ ఇచ్చారు. మిషన్ సుదర్శన చక్ర, ఏఐ సమ్మిట్, డ్రోన్స్, సీ-శాట్‌పై వివిధ రకాల ప్రశ్నలు అడిగారని పలువురు పేర్కొన్నారు. చరిత్ర నుంచి అడిగిన ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. చాలా తక్కువమందికి తెలిసిన ఘరానా సింగర్ మల్లిఖార్జున మన్సూర్, క్షేత్ర-పట్ని మూలం తదితరాల ప్రశ్నలు అడిగి ఆశ్చర్యపరిచారు. ఈసారి కటాఫ్ 75-80 మధ్య ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం 100 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్రకు చెందిన అభ్యర్థులు హాజరయ్యారు. మారేడ్‌పల్లి ప్రాంతంలోని పికెట్ కేంద్రీయ విద్యాలయం కేంద్రానికి ఆరుగురు అభ్యర్థులు మొదటి సెషన్‌కు 5-10 నిమిషాలు ఆలస్యంగా రావడంతో వారిని అధికారులు అనుమతించలేదు.