Share News

మెస్సీని తీసుకురావడం కరెక్టేనా?

ABN , Publish Date - Mar 07 , 2026 | 03:57 AM

జిల్లా కలెక్టర్‌గా మీకు అవకాశం వస్తే ఎలా పని చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించింది కదా..

మెస్సీని తీసుకురావడం కరెక్టేనా?

  • మెస్సీని తీసుకురావడం కరెక్టేనా? తెలంగాణ గ్లోబల్‌ రైజింగ్‌ ఉపయోగమేనా?

  • హైడ్రోజన్‌ కార్లు మేలా? విద్యుత్తు కార్లు మేలా?

  • యూపీఎస్సీ ఇంటర్వ్యూలో లక్ష్మీ రచనకు ప్రశ్నలు

  • ‘ఆంధ్రజ్యోతి’తో సివిల్స్‌ 178 ర్యాంకర్‌ లక్ష్మీ రచన

హైదరాబాద్‌, మార్చి 6 (ఆంధ్ర జ్యోతి): జిల్లా కలెక్టర్‌గా మీకు అవకాశం వస్తే ఎలా పని చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించింది కదా.. దాన్ని మీరు ఎలా చూస్తారు? ప్రపంచ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు మెస్సీని తీసుకరావడంపై మీ అభిప్రాయం ఏమిటి? ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదివారు కదా.. విద్యుత్తు వాహనాలు, హైడ్రోజన్‌ వాహనాల్లో ఏది ఉత్తమం? ఈ ప్రశ్నలన్నీ తాజాగా వెలువడిన యూపీఎస్సీ ఫలితాల్లో 178వ ర్యాంకుతో సత్తాచాటిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన లక్ష్మీరచనను యూపీఎస్సీ బోర్డు అడిగిన ప్రశ్నలు!! అన్ని ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందిన బోర్డు ఆల్‌ఇండియా 178వ ర్యాంకులో ఆమెను నిలిపింది. యూపీఎస్సీ ర్యాంకులు విడుదల చేసిన సందర్భంగా లక్ష్మీ రచనతో ‘ఆంధ్రజ్యోతి’ మాట్లాడగా ఆమె సక్సెస్‌ గురించి పలు అంశాలను పంచుకున్నారు. తండ్రి వెంకటేశ్వర్లు.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా.. తల్లి తులసి.. ఈఎ్‌సఐ డాక్టర్‌గా పని చేస్తున్నారని.. బాల్యం నుంచి ఇంటర్మీడియట్‌ వరకు కూకట్‌పల్లిలో చదువుకున్నట్లు తెలిపారు. లక్ష్మీ రచన ఐఐటీ ఇండోర్‌లో 2021లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. తర్వాత పుణెలో విద్యుత్తు వాహనాలు తయారు చేసే సంస్థలో పని చేశారు.. ప్రైవేటు ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడంతో.. సివిల్స్‌ వైపు అడుగులు వేశానని ఆమె చెప్పారు. ఆంథ్రోపాలజీ సబ్జెక్టును ఎంచుకున్నానని.. ఢిల్లీ, హైదరాబాద్‌లో కొన్ని సబ్జెక్టులో శిక్షణ తీసుకొని ప్రయత్నం చేస్తే నాలుగో ప్రయత్నంలో విజయం సాధించానని తెలిపారు. విద్యార్థులు, యువత, వృద్ధులకు సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటే.. అన్ని రంగాల్లో మంచి ఫలితాలు వస్తాయనే నమ్మకం తనకు ఉందన్నారు. అధికారిగా తనకు అవకాశం వస్తే వైద్య సేవలను పేదలకు, మహిళలకు పూర్తిస్థాయిలో అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానన్నారు.


తడుముకోకుండా సమాధానాలిచ్చా

ఇంటర్వ్యూలో బోర్డు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి ఆందోళన లేకుండా సమాధానమిచ్చానని తెలిపారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ మీదనే ఎక్కువ ప్రశ్నలు వేశారని.. దాని అవసరం ఏమిటి? అనే కోణంలో అడిగారని చెప్పారు.. ప్రభుత్వం పెట్టుబడుల సమీకరణకు ఆ సమావేశం దోహదపడిందని.. కోర్‌ అర్బన్‌, క్యూర్‌.. ఇలా ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలను వివరించానని, ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణంతోపాటు ఫ్యూచర్‌ సిటీ.. ప్రభుత్వ లక్ష్మాలను వివరించినట్లు తెలిపారు. ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీని హైదరాబాద్‌కు ఆహ్వానించారు కదా? దానిపై ప్రశ్నించగా.. యువతలో క్రీడా స్ఫూర్తిని కలిగించేందుకు.. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతిని తెలిపేందుకు ఆ ఈవెంట్‌ ఉపయోగపడిందని చెప్పినట్లు వివరించారు. కోల్‌కతా, బెంగుళూరులో క్రీడాకారుల విజయోత్సవాల సందర్భంగా తొక్కిసలాట మాదిరి ఘటన చోటచేసుకుంటే మీరు కలెక్టర్‌గా ఎలాంటి చర్యలు తీసుకునేవారు? అని ప్రశ్నిస్తే.. దానిపై కూడా ఒక అధికారిగా.. అన్ని విభాగాల సమన్వయంతో ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరించానని తెలిపారు. విద్యుత్తు వాహనాలు మంచివా? హైడ్రోజన్‌ వాహనాలు మంచివా? అనే కోణంలో కూడా ప్రశ్నించారని.. దానిపై తనకున్న అభిప్రాయాలను బోర్డుతో పంచుకున్నట్లు లక్ష్మిరచన వివరించారు.

Updated Date - Mar 07 , 2026 | 03:57 AM