దర్యాపూర్ భూముల.. సర్వేపై కలకలం
ABN , Publish Date - Jun 25 , 2026 | 01:07 AM
నాటి ప్రభుత్వాలు ఇచ్చిన భూములను ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతుల్లో ఆందోళన మొదలయ్యింది. ప్రభుత్వ అవసరాల కోసం నెలరోజులుగా భూములను సర్వేచేసి, అందులో కొంత భూమిని తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు కందకాలు కొడుతుండడంతో రైతులు అడ్డుకుంటున్నారు. అసలు ఎలాంటి ప్రకటనలు చేయకుండానే ఆ భూములను ఏ అవసరాల
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
నాటి ప్రభుత్వాలు ఇచ్చిన భూములను ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతుల్లో ఆందోళన మొదలయ్యింది. ప్రభుత్వ అవసరాల కోసం నెలరోజులుగా భూములను సర్వేచేసి, అందులో కొంత భూమిని తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు కందకాలు కొడుతుండడంతో రైతులు అడ్డుకుంటున్నారు. అసలు ఎలాంటి ప్రకటనలు చేయకుండానే ఆ భూములను ఏ అవసరాల కోసం తీసుకుంటున్నారో నోటీసులు జారీచేయడంతో రైతుల కుటుంబాల్లో కలకలం రేపుతున్నది. కనీసం ఆ భూములకు పరిహారం ఇస్తామనే మాట చెప్పకుండానే కొంతభూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటామని అధికారులు చెబుతుండడం రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని ముత్తారం మండలం దర్యాపూర్ గ్రామంలోని 140, 141, 144, 145, 149 సర్వేనంబర్లలో సుమారు 200ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంతభూమిని గ్రామంలో గల రైతులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ హయాంలో 1992లో కొందరికి, ఆ తర్వాత 1997, 2000, 2006-07, 2012లో ఎకరం నుంచి 4ఎకరాల వరకు అసైన్డ్ కింద భూములకు పట్టాలను ఇచ్చారు. ఇందులో కొందరికి పట్టాదారు పాసు పుస్తకాలు కూడా జారీచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా కొంతమంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను జారీచేసింది. ఆ పాసు పుస్తకాల్లో అసైన్డ్ భూమి అని పేర్కొన్నారు. ఆ భూములను రైతులు సాగుకు అనుకూలంగా లక్షల రూపాయలు వెచ్చించి చదును చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరప్రభ పథకం కింద బోర్లు వేయించడంతో పాటు విద్యుత్‌లైన్లు వేసి కనెక్షన్లు ఇచ్చారు. బావుల తవ్వకాలు కూడా చేపట్టారు. ఉపాధిహామీ పథకం ద్వారా భూములను కూడా చదునుచేశారు. ముప్పయి, నలభై ఏళ్లుగా ఈ భూములను నమ్ముకున్న రైతులు వరి, పత్తి పంటలను సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇందులో కొందరు రైతులకు రైతుబంధు, రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కూడా అందింది.
ఫ భూముల సర్వేతో మొదలైన గుబులు..
ప్రభుత్వ అవసరాల కోసం అంటూ నెల పదిహేను రోజుల నుంచి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, సర్వేఅండ్‌ల్యాండ్స్ రికార్డ్స్ సిబ్బంది సర్వేచేపట్టారు. అప్పటినుంచి రైతుల్లో గుబులు మొదలయ్యింది. నాటి ప్రభుత్వాలు ఇచ్చిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే విషయం ఈ నోటా, ఆ నోటా తెలియడంతో రైతులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఐదు సర్వే నంబర్లలో సుమారు 200ఎకరాల వరకు భూములు ఉన్నప్పటికీ, ప్రభుత్వ అవసరాల కోసం ముందుగా 80ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు, హద్దులు పెట్టి దాని చుట్టూ రెండురోజులుగా కందకాలు కొట్టి, బోర్డులు పాతే పనులను రైతులు అడ్డుకుంటున్నారు. మా భూములు మాకే కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈనెల 24వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచారణకు రావాలంటూ రైతులకు నోటీసులు జారీచేశారు. అయితే రైతులు మాత్రం తమ ఆధీనంలో ఉన్న భూములను ప్రభుత్వానికి ఇచ్చేది లేదంటూ తెగేసి చెబుతున్నారు.
ఫ భూముల స్వాధీనంపై స్పష్టత ఇవ్వని అధికారులు..
దర్యాపూర్ గ్రామంలో రైతుల ఆధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకునే విషయమై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదని రైతులు తెలిపారు. వారు బుధవారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ముప్పయి, నలభై ఏళ్లుగా ప్రభుత్వం ఇచ్చిన పట్టాల ఆధారంగానే సాగు చేసుకుని జీవిస్తున్నామన్నారు. నాటి ప్రభుత్వాలు కొందరికి బోర్లు వేయించడం, బావులు తవ్వించడంతో పాటు విద్యుత్‌కనెక్షన్లు ఇచ్చిందన్నారు. తాము కూడా 5నుంచి 10లక్షల రూపాయలకు పైగా వెచ్చించి భూములను చదును చేసుకున్నామని అన్నారు. తాము కష్టపడి పండించిన పంట మొత్తం పెట్టుబడులకే సరిపోతున్నదని వాపోయారు. తమ భూములను ఏ అవసరాల కోసం తీసుకుంటున్నారో చెప్పడం లేదన్నారు. 80ఎకరాల భూముల చుట్టూ కందకాలు తీస్తున్నారని తెలిపారు. కోకాకోలా కంపెనీ కోసం రామగిరి మండలం రత్నాపూర్‌లో సేకరించిన భూమిలో అసైన్డ్ భూములు కలిగిన రైతులకు ఎకరానికి 23లక్షల రూపాయల వరకు నష్టపరిహారాన్ని చెల్లించారని, కానీ తమ భూములకు పరిహారం ఇస్తామనే మాట కూడా మాట్లాడడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రాజెక్టుల కింద సేకరించిన భూముల్లో అసైన్డ్ భూములు గల వారికి కూడా పరిహారం అందించిన దాఖలాలు జిల్లాలో ఉన్నాయన్నారు. కానీ పరిహారం ఊసెత్త కుండా, ప్రత్యామ్నాయం గురించి తెలపకుండా భూములను స్వాధీనం చేసుకుంటామని చెబుతున్నారని తెలిపారు. ఈ విషయమై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దృష్టికి తీసుక వెళ్లామని చెప్పారు. మంత్రి వెంటనే స్పందించి మా జీవనాధారాన్ని, మా నోటి కాడి బుక్కను లాక్కోకుండా చూడాలని దర్యాపూర్ రైతులు కోరారు.
ఫ భూములు లాక్కుంటే ఆత్మహత్యలే శరణ్యం..
- జంగ స్వామి, రైతు దర్యాపూర్
మాకు నాలుగు ఎకరాల భూమిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ఆంరఽధప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అసైన్డ్ కింద ఇచ్చింది. పట్టాదారు పాసు పుస్తకం కూడా ఉంది. ఈ భూమిలో నాలుగు బోర్లు వేస్తే ఒక దాంట్లోనే నీళ్లు వచ్చాయి. ఒక వ్యవసాయ బావిని కూడా తవ్వించాను. వీటితో పాటు భూమి చదును కూడా చేశాం. మొత్తం 10లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యింది. మేం ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నామని, ఆ భూములను లాక్కుంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం. ప్రభుత్వ అవసరాలకు సాగుకు యోగ్యంగా లేని భూములను గుర్తించి తీసుకోవాలి.
ఫ మా భూములు మాకే కావాలి..
- రాపెల్లి రాజయ్య, సర్పంచ్, దర్యాపూర్
మాకు కూడా 2ఎకరాల భూమి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలతో భూములను సాగు చేసుకుని జీవిస్తున్నాం. ప్రభుత్వం నుంచి కొందరికి రైతుబంధు, రైతు భరోసా కూడా వచ్చింది. ఇక్కడ భూములను సర్వేచేస్తున్న అధికారులు కంపెనీ వస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వ అవసరాల కోసం భూములను తీసుకుంటున్నామని చెబుతున్నారని, ముందుగా 80ఎకరాల భూములకు కందకాలు తీస్తున్నారు. మా భూములు మాకే కావాలి. మంత్రి శ్రీధర్‌బాబు చొరవతీసుకుని మా భూములను ప్రభుత్వం లాక్కోకుండా చర్యలు తీసుకోవాలి.