Share News

గంజాయి చాక్లెట్‌తో ‘తండాయి పాలు’

ABN , Publish Date - Feb 18 , 2026 | 06:13 AM

కాచి చల్లార్చిన పాలల్లో ఐస్‌, డ్రైఫ్రూట్స్‌ కలిపి తండాయి పాలు అనే పేరుతో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో విరివిగా విక్రయిస్తుంటారు. వేసవిలో తండాయి పాలకు మంచి గిరాకీ ఉంటుంది.

గంజాయి చాక్లెట్‌తో ‘తండాయి పాలు’

  • హైదరాబాద్‌లో గ్లాసు రూ.150 చొప్పున విక్రయం.. యూపీకి చెందిన వ్యక్తి అరెస్టు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): కాచి చల్లార్చిన పాలల్లో ఐస్‌, డ్రైఫ్రూట్స్‌ కలిపి తండాయి పాలు అనే పేరుతో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో విరివిగా విక్రయిస్తుంటారు. వేసవిలో తండాయి పాలకు మంచి గిరాకీ ఉంటుంది. అయితే, యూపీకి చెందిన ఓ వ్యక్తి మామూలుగా కాకుండా గంజాయి చాక్లెట్లు కలిపిన తండాయి పాలను హైదరాబాద్‌లో నడిరోడ్డుపై విక్రయిస్తున్నాడు. ఒక్కో గ్లాసు రూ.150 చొప్పున అమ్మేస్తూ చాలామందిని గంజాయికి బానిసలను చేస్తున్నాడు. ఈ సంగతి తెలుసుకున్న ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ పోలీసులు ఆ వ్యక్తిని మంగళవారం అరెస్టు చేయడమే కాక అతని వద్ద 1920 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌టీఎఫ్‌ టీమ్‌ లీడర్‌ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రాకు చెందిన బి. వికాస్‌ శర్మ కొంత కాలంగా హైదరాబాద్‌లోని చుడీబజార్‌ నుంచి బేగం బజార్‌ మధ్యలో తండాయి పాలు విక్రయిస్తున్నాడు. ఈ పానీయం ఒక్కో గ్లాసు ధర రూ.50 ఉంటుంది. అయితే, వికాస్‌ శర్మ గంజాయి చాక్లెట్‌ను పాలలో కలిపి ఒక్కో గ్లాస్‌ రూ.150 చొప్పున గుట్టుగా విక్రయిస్తున్నాడు. వికాస్‌ శర్మపై నిఘా పెట్టిన ఎస్‌టీఎఫ్‌ పోలీసులు.. చార్మినార్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఉప్పుగూడలోని ఓ ఇంట్లో వికాస్‌ శర్మ తండాయి పాలు తయారు చేస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. గంజాయి చాక్లెట్లలో 9.6 కిలోల గంజాయిని వినియోగించినట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.


తెల్లాపూర్‌లో 101 కిలోల గంజాయి స్వాధీనం

తెల్లాపూర్‌ ప్రాంతంలో ఉన్న ఓ లేబర్‌ అడ్డాలో రూ.25.72 లక్షల విలువైన సుమారు 101.7 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బస్వ జగన్నాథం(37), పల్లపు లక్ష్మీనారాయణ(52) గంజాయి వ్యాపారం చేస్తుంటారు. ఒడిశాకు చెందిన రాజు అనే వ్యక్తి నుంచి సుమారు 101.7 కిలోల గంజాయిని తెప్పించి నిల్వ చేశారు. పోలీసులు దాడి చేసి జగన్నాథం, లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద రూ.25.72 లక్షల గంజాయితో పాటు నాలుగు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Feb 18 , 2026 | 06:15 AM