అకాల వర్షం.. అన్నదాతకు నష్టం
ABN , Publish Date - May 08 , 2026 | 12:56 AM
జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురియడంతో పలు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వరి ధాన్యం
జగిత్యాల, మే 7 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురియడంతో పలు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వరి ధాన్యం తడిచిపోయింది. వరద నీటి ప్రవాహం వల్ల పలు కేంద్రాల్లో కుప్పల్లో నిల్వ ఉన్న ధాన్యం కొట్టుకుపోయింది. ఈదురు గాలులు, వర్షం వల్ల ధాన్యం కాపాడుకోవడానికి అన్నదాతలు అవస్థలు పడ్డారు. జిల్లాలో ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అత్యధికంగా మెట్‌పల్లి మండలం జగ్గసాగర్‌లో 29.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి ఉంచిన 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం, 2 వేల క్వింటాళ్ల మక్కలు తడిచి పోయాయి. జిల్లాలోని మెట్‌పల్లి, కోరుట్ల, మల్లాపూర్, రాయికల్, జగిత్యాల, మేడిపల్లి, భీమారం తదితర మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం తడిచి రైతులు లబోదిబో మంటున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న మామిడి కాయలు రాలి నేలమట్టమయ్యాయి. జిల్లాలో సుమారు 200 ఎకరాల్లో మామిడి పంట నష్టానికి గురయినట్లు ప్రాథమిక అంచనా ఉంది. అకాల వర్షం వల్ల మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల వంటి పట్టణాల్లో అంతర్గత రహదారులు జలమయమయ్యాయి. మెట్‌పల్లి పట్టణంలో భవన నిర్మాణానికి వినియోగిస్తున్న పలు కర్రలు నేల కూలాయి.
ఫజగిత్యాలలో రైతుల రాస్తారోకో..
అకాల వర్షం వల్ల తడిచిన ధాన్యం, మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో రైతులు రాస్తారోకో చేశారు. సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల అకాల వర్షానికి ధాన్యం తడిచి పోయిందని వాపోయారు. అధికారులు వెంటనే తడిచిన వరి ధాన్యం, మొక్కజొన్నను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూస్తామని పోలీసులు నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
-కలెక్టర్ సత్యప్రసాద్
జిల్లాలో అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కలెక్టర్ సత్య ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు, నిర్వాహకులు వర్షాలకు ధాన్యం కుప్పలు తడవకుండా టార్పాలిన్లతో కప్పాలని, తడిచిన ధాన్యాన్ని తగినంత ఆరబెట్టాలని సూచించారు. జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నందున రైతులు చెట్ల వద్ద, కరెంట్ స్తంభాల వద్ద ఉండకూడదని కోరారు.
ఫకోరుట్ల రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షంతో మామిడి నేల రాలి నువ్వు పంట ఒరిగింది. పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొంత మేర తడిచింది. ఈదురు గాలులతో పలు గ్రామాల్లో మామిడి కాయలు రాలిపోవడంతో మామిడి రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. జోగినిపల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో వర్షం నీరు ప్రవహించడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఫకోరుట్ల: పట్టణంలో ఈదురు గాలులతో వర్షం కురియడంతో పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. పట్టణ శివారులోని రాయికల్ వెళ్లే రహదారిలో భారీ వృక్షం కూలడంతో రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. పోలీసులు, మున్సిపల్ అధికారులు చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. పట్టణంలోని రాంనగర్ ప్రాంతానికి చెందిన వ్యగారపు విజయ్ అనే వ్యక్తికి ఇంటి రెండో అంతస్తులోని సైడ్ వాల్ కూలిపోయింది.
ఫమెట్‌పల్లి రూరల్: మండలంలో అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు ధాన్యం కుప్పలపై కవర్లు కప్పినప్పటికి మెట్లచిట్టాపూర్, వెల్లుల్ల గ్రామాలతో పాటు పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వర్షం నీటిలో కొట్టుకుపోయింది. పలు గ్రామాల్లో మామిడి కాయలు నేలరాలాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తొందరగా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
ఫమెట్‌పల్లి రూరల్: అకాల వర్షానికి మెట్‌పల్లి పట్టణంలోని పలు కాలనీల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు కాలనీల్లో వర్షపునీరు పొంగి పొర్లింది. ఈదురుగాలులకు ఓ హోర్డింగ్ హైటెన్షన్ వైర్ల మీద పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో విద్యుత్ నిలిచి ఉండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వెంకట్రావుపేట్ జాతీయ రహదారిపై వర్షపు నీరు చెరువును తలపించేలా ప్రవహించింది.