అకాల వర్షం.. అన్నదాత కష్టం
ABN , Publish Date - May 07 , 2026 | 01:06 AM
జిల్లాలో పలుచోట్ల కురిసిన ఆకాల వర్షంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంథని మున్సిపాటిటీ పరిధిలోని, మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వరి ధాన్యం బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి
మంథని/మంథనిరూరల్ మే 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలుచోట్ల కురిసిన ఆకాల వర్షంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంథని మున్సిపాటిటీ పరిధిలోని, మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వరి ధాన్యం బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి తడిచింది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో ఒక్కసారిగా గురువారం అర్థరాత్రి తర్వాత భారీ గాలివానతో పాటు భారీగా వర్షం కురిసింది. దీంతో సింగిల్‌విండో ద్వారా 36 కొనుగోలు కేంద్రాల్లో అమ్మకం కోసం ఉన్న వరి ధాన్యం కుప్పలు వర్షంతో తడిచిపోయింది. మంథని మార్కెట్ యార్డులో భారీగా ధాన్యం నిల్వలు తడిచిపోయాయి. వరి కుప్పల మధ్య నిల్వ ఉన్న వర్షం నీటిని బయటకు పంపడా నికి రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఆకాల వర్షంతో రైతులు చివరి దశలో నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. రాత్రి వడ్ల కుప్పలపై పాలిథిన్ కవర్లు, టార్పాలిన్లు కప్పుకున్నప్పటికీ బలంగా వీచిన గాలిదూమారంతో కొట్టుకుపోయాయి. వర్షాల వలన గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎక్కవగా తడవడంతో రైతులు ఆరబెట్టడానికి ఇబ్బందులు పడ్డారు. ధాన్యం కోనుగోళ్లు వేగవంతంగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.
ముత్తారం: ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందిన సమ యంలో వరుణుడు విక్రయించుకుందామంటే పగబట్టినట్లు అవుతోంది. మండలంలోని ఖమ్మంపల్లి గ్రామం బుధవారం రాత్రి అకాల వర్షం పడటంతో రైతులు ఆగమయ్యారు. గంటపాటు ఏకదాటి వర్షంతో ధాన్యం తడిసి ముద్ద యింది. వర్షం తగ్గిన తర్వాత ధాన్యం రాశుల మధ్య చేరిన నీటిని రైతులు బయటికి తోడివేశారు. గ్రామానికి చెందిన గంట రమేష్ రెండు ట్రాక్టర్ ట్రిప్పుల వడ్లు, చింతం రామక్కకు చెందిన మూడు ట్రాక్టర్ల వడ్లు, మంగ నరసింహ కు చెందిన రెండు ట్రాక్టర్ల వడ్లు అకాల వాన పడడంతో కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు కొట్టుకపోయాయి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసు కోవాలని రైతులు కోరుతున్నారు.
పాలకుర్తి: మండలంలో మంగళవారం రాత్రి కురిషిన అకాల వర్షం, ఈదురు గాలులతో మామిడి నేల రాలింది, కొన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంబాలు విరిగిపోయాయి. దీంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. డ్డది.స్పం దించిన అధికారులు వెంటనే మరమ్మతు పనులు చేపట్టి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.
కళ్యాణ్‌నగర్/మార్కండేయ కాలనీ : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. తెల్లవా రుజాము వరకు వర్షం కురువడంతో ప్రధాన నాలా పొంగిపొర్లాయి. జీడీకే 5ఇంక్లైన్, 2ఇంక్లైన్ మోరీ వద్ద వాహనాల రాకపోలకు అంతరాయం ఏర్పడింది. జనగామ ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొట్టుకు పోయింది. ఆరుగాలం శ్రమించి రైతులుపండించిన వర్షం వరద నీటిలో కొట్టుకుపోగా రైతులు కన్నీరుమున్నీరయ్యారు. కళ్యాణ్‌నగర్, లక్ష్మీనగర్, ఓల్డ్ అశోక్ టాకీస్, బస్టాండ్ వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు గాలికి కొట్టుకుపోయి రోడ్లపై పడ్డాయి. మార్కండేయకాలనీలోని ఒక హోటల్ వద్ద గాలికి ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌స్థంబాలు కూలిపోయి నాలాలో పడిపోయాయి. చెట్లు, హోరింగ్‌లు చాలాచోట్ల రోడ్లపై కూలిపోయాయి. విద్యుత్ వైర్లు తెగిపోయి పారిశ్రామిక ప్రాంతం చీకటి మయంగా మారింది. సింగరేణి క్వార్టర్స్‌లో చాలా చెట్లు నేలకొరిగాయి. నిన్న మొన్నటి వరకు భానుడి ప్రతాపంతో భగభగమన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతం మంగళవారం కురిసిన భారీ వర్షంతో చల్లబడగా బుధవారం ఉదయం భానుడు మళ్లీ ప్రతాపం చూపాడు. 37డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.