అకాల వర్షం.. అతలాకుతలం!
ABN , Publish Date - May 07 , 2026 | 05:23 AM
అకాల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది. మంగళవారం అర్ధరాత్రి పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి ఉంచిన ధాన్యంతో పాటు కోతకు...
అర్ధరాత్రి పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం..
కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయినధాన్యం
(ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్): అకాల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది. మంగళవారం అర్ధరాత్రి పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి ఉంచిన ధాన్యంతో పాటు కోతకు వచ్చిన వరి పంట పూర్తిగా దెబ్బ తిన్నది. తోటల్లో మామిడి నేల రాలి తీరని నష్టం వాటిల్లింది. మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో గాలి వానలు పడ్డాయి. పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు, పెద్ద పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, బెల్లంపల్లి, జైపూర్, భీమారం, చెన్నూ రు, మందమర్రి, కన్నెపల్లి మండలాల్లోని 1,830 మంది రైతులకు చెందిన 3,191 ఎకరాల వరి నీటి పాలైంది. ఇటు జైపూర్, దండేపల్లి, హాజీపూర్ మండలాల్లోని 140 మంది రైతులకు చెందిన 411 ఎకరా ల్లో మామిడి పంట దాదాపు 50శాతం మేర దెబ్బ తిన్న ట్లు ఉద్యానశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం మండలం బామనగర్‌లో పలు ఇళ్ల రేకుల పైకప్పులు ఎగిరిపోయాయి. పెంచికల్‌పేట మండలం ఎల్కపల్లి శ్యాం అనే రైతుకు చెందిన ధాన్యం కుప్పపై పిడుగు పడడంతో కాలిపోయింది. భూపాలపల్లి జిల్లాలో సుమారు గంట పాటు ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులు, పిడుగులతో కురిసిన వానకు ఐదు మండలాలు అతలాకుతలమయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లోని సుమారు 35వేల క్వింటాళ్లు తడిసి ముద్దయ్యింది. 45 క్వింటాళ్ల మామిడి నేలరాలింది. క్వింటాళ్ల కొద్దీ వరి ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. పెద్దపల్లి జిల్లాలోని మంథని, కమాన్‌పూర్, ముత్తారం, ధర్మారం, పాలకుర్తి, అంతర్గాం మండలాల్లోనూ గాలి వానతో పంటలకు నష్టం వాటిల్లింది. ములుగు, జనగామ జిల్లాల్లోనూ కల్లాల్లో అరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. మంథని వ్యవసాయ మార్కెట్‌లో ఆరబోసిన వరి ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. బుధవారం మార్కెట్‌ను సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు.. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. కాగా, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.