kumaram bheem asifabad- ఐదు నెలులుగా అందని వేతనాలు
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:22 PM
మిషన్ భగీరథ పథకంలో తాగునీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు అందడంలేదు
- నేడు ఈఈ కార్యాలయం ముట్టడికి పిలుపు
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): మిషన్ భగీరథ పథకంలో తాగునీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు అందడంలేదు. కార్మికులకు ప్రతినెల వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిబంధన విదించినప్పటికీ కాంట్రాక్టర్లు అవేవి పట్టించుకోవడంలేదు. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలకు తాగునీటిని అందించే తమ కుటుంబాలు గడవక ఆర్థికంగా నానా ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు వాపోతున్నారు. అధికారులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడంలేదని వారు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా 500 మంది కార్మికులు ఉన్నారు.
- పల్లెల్లో తాగునీటి సరఫరాకు..
గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా పల్లెల్లో తాగునీరు సరఫరా చేసేందుకు 2005లో ప్రభుత్వం అపరేటర్లు, పిట్టర్లు, బెడ్ అపరేటర్లు, కెమికల్ ఆపరేటర్లు, నీటి సరఫరా లైన్‌మెన్లకు విధుల్లోకి తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ మిషన్ భగీరథ ద్వారానే రోజు నీటి సరఫరా జరుగుతోంది.అయితే అప్పటి వరకు అర్‌డబ్ల్యుఎస్‌లో పని చేస్తున్న కార్మికులను తిరిగి మిషన్ భతీరథలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి వారు దాదాపు 18 ఏళ్లుగా విదులు నిర్వహిస్తున్నారు. కాగా ప్రస్తుతంమిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులకు నెలకు రూ. 13వేల నుంచి 15వేల లోపు వేతనాలే కాంట్రాక్టర్లు చెల్లిస్తున్నారు. అయితే ప్రభుత్వం తమకు నెలకు రూ. 20వేల వేతనం ఇస్తున్నా కాంట్రాక్టర్లు మాత్రం అందులో కోత పెడుతూ కేవలం రూ.13 నుంచి రూ.15వేల లోపే అందిస్తున్నారని కార్మికులు చెబుతున్నారు. వేతనాలు తమ ఖాతాలో పడుతున్నప్పటికీ పేస్లిప్పులు ఇవ్వడంలేదన్నారు. దీంతో తమకు ఎంత వేతనం వస్తుందో తెలియక నష్టపోతున్నట్లు కార్మికులు తెలిపారు. పైగా ప్రతీ నెల ఈపీఎఫ్, ఈఎస్‌ఐ జమ చేయకుండా పెండింగ్‌లో పెడుతూనష్టం కలిగిస్తున్నారని కార్మికులు చెబుతన్నారు. ప్రభుత్వం స్పందించి తమకు పెండింగ్‌లో ఉన్న వేతనాలుచెల్లించేలా కాంట్రాక్టర్లను ఆదేశించాలని కార్మికులు కోరుతున్నారు. కాగా మిషన్ భగీరథ ఎల్‌అండ్‌టీ, ఎవరెస్ట్ ఏజెన్సీ కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం మిషన్ భగీరథ కార్యాలయం ముట్డడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మిషన్ భగీరథ కాంటాక్ట్ కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు అత్మకూరి చిరంజీవి తెలిపారు. కార్మికులకు సంబంధించిన పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని పలుమార్లు సంబందిత అదికారులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ స్పందించలేదన్నారు. జిల్లాలోని మిషన్ భగీరథ కార్మికులు ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.