Share News

‘మనిషి కనిపించొద్దు!’

ABN , Publish Date - Apr 24 , 2026 | 04:28 AM

సచివాలయంలోని రెండో అంతస్తులో ఉన్న ఆర్థిక మంత్రి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఛాంబర్లకు సందర్శకులు వెళ్లకుండా కొనసాగుతున్న....

‘మనిషి కనిపించొద్దు!’

  • సచివాలయం ఆర్థికశాఖలో ‘అప్రకటిత నిషేధం’

  • అనుమతి పత్రాల జారీలో ఆంక్షలు

  • చర్చకు దారితీసిన ఆంధ్రజ్యోతి ‘పహారాలో ఆర్థిక మంత్రి పేషీ’ కథనం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): సచివాలయంలోని రెండో అంతస్తులో ఉన్న ఆర్థిక మంత్రి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఛాంబర్లకు సందర్శకులు వెళ్లకుండా కొనసాగుతున్న ‘అప్రకటిత నిషేధం’ అంశంపై మరో కొత్త వ్యవహారం తెరపైకి వచ్చింది. పెండింగ్‌ బిల్లులు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, పింఛన్లు ఇతరత్రా సాయం కోసం వచ్చేవారెవరూ అటువైపు కనిపించకూడదంటూ సెక్యూరిటీ సిబ్బందికి కఠిన ఆదేశాలు జారీ అయ్యాయని సమాచారం. ‘అన్నీ చేస్తూనే ఉన్నాం కదా.. అయినా ఇక్కడివరకు ఎందుకు వస్తున్నారు’ అనే ఉద్దేశంతోనే రెండో అంతస్తులో ‘మనిషి కనిపించొద్దు’ అంటూ ‘ముఖ్యమైన’ వారి వద్ద నుంచి హుకూం జారీఅయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతోనే సెక్యూరిటీ విభాగం రెండో అంతస్తులో ఎర్రటి రిబ్బన్లతో అన్నివైపుల నుంచి పటిష్టమైన బందోబస్తును ఏర్పాటుచేసినట్టు సమాచారం. అయితే, ‘పనుల కోసం అంతదూరం నుంచి వస్తే.. లోపలికి కూడా అనుమతించకపోవడం’ పట్ల సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ చేస్తే ఇక్కడివరకూ ఎందుకు వస్తామనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

భద్రతా సిబ్బందికి ‘మెమో’ల హెచ్చరికలు

ఇటీవల కొంతమందిని లోపలికి పంపించారన్న కారణంగా సెక్యూరిటీ విభాగం ముఖ్య అధికారి, కిందిస్థాయి సిబ్బందిని తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. మళ్లీ ఎవరినైనా లోపలికి అనుమతిస్తే ‘మెమో’లు జారీ చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. రెండో అంతస్తులో అమలవుతున్న బారికేడ్ల అంశంపై గురువారం ‘పహారాలో ఆర్థిక మంత్రి పేషీ’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం సచివాలయంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు అధికారుల మధ్య ఈ విషయంపై విస్తృతస్థాయి చర్చ జరిగింది. ఇక, ఆర్థికశాఖకు తమ సమస్యల పరిష్కారం కోసం గురువారం కొంతమంది సందర్శకులు రాగా.. వారికీ నిరీక్షణే ఎదురైంది. సందర్శకులకు అనుమతి పత్రాల జారీలో.. అధికారులు జాగ్రత్త వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరైనా రెండో అంతస్తు అని చెబితే చాలు.. ఏ పేషీ.. ఎవరిని కలవాలి.. వంటి వివరాలను ఆరా తీసి, అనుమతి పత్రాలు ఇస్తుండడం గమనార్హం. ఆర్థిక శాఖ అని చెబితే మాత్రం పాసుల జారీలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్టు తెలిసింది. దీంతో చాలామంది ఇతర మంత్రుల పేషీల నుంచి ఫోన్లు చేయించుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిసింది. ఆర్థికశాఖకు వచ్చేవారిపై ఉన్న ఆంక్షలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సందర్శకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Apr 24 , 2026 | 04:28 AM