Share News

హైదరాబాద్‌లో వర్సిటీ ఆఫ్‌ లండన్‌ క్యాంపస్‌

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:42 AM

ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ తన ఆఫ్‌షోర్‌ క్యాంప్‌సను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు సుముఖత వ్యక్తం చేసింది.

హైదరాబాద్‌లో వర్సిటీ ఆఫ్‌ లండన్‌ క్యాంపస్‌

  • లేక్‌వ్యూ వసతి గృహంలో తాత్కాలిక ప్రాంగణం

  • భారత్‌ ఫ్యూచర్‌ సిటీ ఎడ్యుకేషన్‌ జోన్‌లో శాశ్వత నిర్మాణం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్ర జ్యోతి): ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ తన ఆఫ్‌షోర్‌ క్యాంప్‌సను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు సుముఖత వ్యక్తం చేసింది. నగరంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, కాస్మోపాలిటన్‌ సంస్కృతి, అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు నెలకొనడంతో.. అంతర్జాతీయ క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ముందుకొచ్చింది. హైదరాబాద్‌ కేంద్రాన్ని ఎంచుకున్న తొలి అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా ఇది నిలవనుంది. యూకేలోని కింగ్స్‌ కాలేజ్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, లండన్‌ బిజినెస్‌ స్కూల్‌ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఈ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థలే. ఈ వర్సిటీకి పూర్తిస్థాయి ఆఫ్‌షోర్‌ క్యాంప్‌సగా హైదరాబాద్‌ ప్రాంగణం నిలవనుండటం విశేషం. దీని విద్యా కార్యకలాపాలను వెంటనే ప్రారంభించేందుకు వీలుగా ప్రభుత్వం తాత్కాలిక చర్యలు తీసుకుంటోంది. లేక్‌వ్యూ అతిథి గృహాన్ని తాత్కాలిక క్యాంప్‌సగా కేటాయించింది. 2027 విద్యా సంవత్సరంలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఈ విద్యా సంస్థ ప్రతినిధులు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌కి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యూచర్‌ సిటీలో... రానున్న రెండేళ్లలో ప్రపంచ ప్రఖ్యాత ఉన్నత విద్యాసంస్థల ఆఫ్‌షోర్‌ క్యాంప్‌సలతో కూడిన నాలెడ్జ్‌ హబ్‌ను నిర్మించే దిశగా రేవంత్‌ సర్కారు కృషి చేస్తోంది. ఈ క్రమంలో యూకేలోని పలు విశ్వవిద్యాలయాలు నగరంలో క్యాంప్‌సల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలో యూకేకి చెందిన 13 పాఠశాలలకు సహకరించేందుకు రాష్ట్ర అధికారులు అక్కడి యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటున్నారు.

Updated Date - Apr 15 , 2026 | 04:42 AM