Share News

సీట్ల పెంపుతో దక్షిణాదికి నష్టమెలా?

ABN , Publish Date - Mar 26 , 2026 | 05:29 AM

అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య పెంపుతో దక్షిణాదికి జరిగే నష్టమేంటో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కోరారు.

సీట్ల పెంపుతో దక్షిణాదికి నష్టమెలా?

  • కాంగ్రెస్‌వి విభజన రాజకీయాలు

  • సీఎం వ్యాఖ్యలపై బండి సంజయ్‌ విమర్శలు

  • చర్చకు సిద్ధమా?: రఘునందన్‌

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య పెంపుతో దక్షిణాదికి జరిగే నష్టమేంటో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కోరారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే తప్పేంటన్నారు. తెలంగాణలో 50శాతం సీట్లు పెంచొద్దని చెబుతున్నారా? అని ప్రశ్నించారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు మహిళలంటే ద్వేషమని.. అందుకే వారి హయాంలో ఈ రిజర్వేషన్లను అమలు చేయలేదని ఆరోపించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఎన్ని జిమ్మిక్కులు చేసినా కాంగ్రెస్‌ పాచిక తమిళనాడు, కేరళలో పారడం లేదు. అందుకే దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని కొత్త డ్రామా మొదలు పెట్టారు?’ అని ధ్వజమెత్తారు. ప్రాంతీయ అసమానతల పేరుతో దేశాన్ని విభజించాలనుకుంటున్నారా.. దేశభక్తి, జాతీయవాదం మీలో మచ్చుకైనా కన్పించవా అని నిలదీశారు. కాగా, దక్షిణాదికి అన్యాయంపై చర్చకు సిద్ధపడాలని ఎంపీ రఘునందన్‌రావు సవాల్‌ చేశారు. కాంగ్రెస్‌లోలా సీల్డ్‌కవర్‌లో సీట్ల పెంపు సంఖ్య ఉండదని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో అన్ని పార్టీలతో చర్చించిన తర్వాతే డీలిమిటేషన్‌పై తుది నిర్ణయం ఉంటుందన్నారు. ఉత్తరాదిలో ఎక్కువ, దక్షిణాదిలో తక్కువగా పార్లమెంట్‌ స్థానాలు పెరుగుతాయని అవగాహన లేని వారు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. అన్ని రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాల్లో 50 శాతం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌కి 80 సీట్లు ఉంటే 160 అవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి ఓ టీవీ ఛానల్‌ మాట్లాడారు.. 80 ఉంటే 120 అవుతాయి కానీ 160 ఎలా అవుతాయో ఆయన చెప్పాలి.’ అని రఘునందన్‌ కోరారు.

Updated Date - Mar 26 , 2026 | 05:29 AM