Union Minister Bandi Sanjay: ఎంఐఎం చీఫ్‌గా మహిళను నియమించగలరా..?
ABN , Publish Date - Jan 12 , 2026 | 04:49 AM
హిజాబ్ ధరించిన మహిళ ఏదో ఒక రోజు భారత ప్రధాని అవుతారు. ఇది నా కల’’ అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్...
మీ పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న అతివలెందరు
అసదుద్దీన్‌కు కేంద్ర మంత్రి సంజయ్ ప్రశ్నలు
హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ‘‘హిజాబ్ ధరించిన మహిళ ఏదో ఒక రోజు భారత ప్రధాని అవుతారు. ఇది నా కల’’ అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘‘అసద్ ఇలాంటి కలలను కనే ముందు ఎంఐఎం పార్టీ అధ్యక్షురాలిగా ఒక మహిళను నియమించగలరా..? బుర్ఖా ధరించిన మహిళ ప్రధాని పదవి చేపట్టాలని ఆలోచించే ముందు.. వారి పార్టీలో నిర్ణయాధికార స్థానాల్లో ఎంత మంది మహిళలు ఉన్నారు?ఎంఐఎం ఇప్పటి వరకు ఎంత మంది మహిళలకు ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది? 2018 ఎన్నికల్లో అక్బరుద్దీన్‌పై బీజేపీ అభ్యర్థి సయ్యద్ షహజాదీ పోటీ చేశారు. ఆమెను బెదిరించి, పలుమార్లు ఇబ్బందులకు గురిచేసి చివరకు ఓడించారు. ప్రస్తుతం ఆమె జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలిగా పనిచేస్తోంది. ఎంఐఎంలో ఎంత మంది మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారో చెప్పాలి..? ఎంఐఎంలో, ప్రజా జీవితంలో, చివరకు వారి ఇళ్లలో కూడా మహిళలకు పరిమితులు విధిస్తున్నారు. ప్రధాని మోదీని చాలా మంది ముస్లిం మైనారిటీ మహిళలు తమ సోదరుడిగా భావిస్తున్నారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో వారికి మేలు జరిగింది.పురుషులతో సంబంధం లేకుండా మహిళల బ్యాంకు ఖాతాలకే పథకాల డబ్బులు వేస్తున్నాం’’ అని సంజయ్ పేర్కొన్నారు.