Share News

అక్రమ మైనింగ్‌పై విచారణకు నిర్దిష్ట గడువు విధించాలి

ABN , Publish Date - Mar 29 , 2026 | 06:49 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మైనింగ్‌ అక్రమాలపై విచారణకు నిర్దిష్ట గడువు విధించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

అక్రమ మైనింగ్‌పై విచారణకు నిర్దిష్ట గడువు విధించాలి

  • నియోజకవర్గాల పునర్విభజనతో సీఎంలో కుంగుబాటు

  • కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌/ కరీంనగర్‌, మార్చి 28(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మైనింగ్‌ అక్రమాలపై విచారణకు నిర్దిష్ట గడువు విధించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఫిర్యాదుల పేరుతో గ్రానైట్‌ కంపెనీలను ఎవరు బ్లాక్‌మెయిల్‌ చేశారో వెల్లడించాలన్నారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌పై విచారణను విచారణను స్వాగతిస్తున్నట్లు పేర్కొంటూ, అసెంబ్లీలో ప్రకటనలకే పరిమితమై, ఆచరణలో చర్యలు లేకపోతే ప్రజలు అంగీకరించరని చెప్పారు. 2024లో అసెంబ్లీ సాక్షిగా ఓఆర్‌ఆర్‌ టోల్‌ టెండర్‌పై నియమించిన సిట్‌ విచారణ ఏమైందని ఆయన ప్రశ్నించారు. కేరళ, తమిళనాడు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అసెంబ్లీని రాజకీయ నిధుల సేకరణకు, బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు వేదికగా ఉపయోగిస్తున్నారా అని బండి ప్రశ్నించారు. సీఎం రేవంత్‌కు చిత్తశుద్థి ఉంటే విచారణ జరిపించి వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలుతో సీఎం రేవంత్‌లో కుంగుబాటు మొదలైందని సంజయ్‌ చెప్పారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్‌ దుష్ప్రచారం చేస్తున్నారని, అన్ని రాష్ట్రాలకు 50 శాతం సీట్లు పెంచుతున్నప్పుడు దక్షిణాదికి అన్యాయం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం డిజైన్‌ లోపానికి ప్రధాన బాధ్యత కేసీఆర్‌దే అయినప్పటికీ కాళేశ్వరం అవినీతి పరులను రేవంత్‌రెడ్డి సర్కార్‌ అరెస్టు చేయడం లేదన్నారు. కేసీఆర్‌, రేవంత్‌ కుమ్మక్కవడం వల్లే కేసీఆర్‌ కుటుంబం సహా బీఆర్‌ఎస్‌ నేతల అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదని బండి ఆరోపించారు.

Updated Date - Mar 29 , 2026 | 06:51 AM