జనగణనను రాజకీయం చేయొద్దు
ABN , Publish Date - Apr 27 , 2026 | 05:20 AM
జనగణనను రాజకీయం చేయవద్దని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ అంశం పూర్తిగా పరిపాలనకు సంబంధించినదన్నారు.
రాష్ట్రాభివృద్ధి ప్రణాళికలకు ఇది పునాది.. ‘సంక్షేమం’పై ఎలాంటి ప్రతికూలత ఉండదు
ప్రజలు కచ్చితమైన సమాచారం ఇవ్వాలి
స్వీయ జనగణన ప్రారంభంలో కిషన్ రెడ్డి
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ/బర్కత్‌పురా/పంజాగుట్ట, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): జనగణనను రాజకీయం చేయవద్దని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ అంశం పూర్తిగా పరిపాలనకు సంబంధించినదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా బీసీ జనాభా గణన కూడా ఇందులో భాగమవుతోందని, ఈ ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని కొనియాడారు. ఆదివారం దిల్‌కుషా గెస్ట్ హౌస్‌లో స్వీయ జనగణనను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా, తర్వాత మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్)తో బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో పోలింగ్ శాతం పెరిగిందన్నారు. హైదరాబాద్‌లో ఎప్పుడూ పోలింగ్ 50 శాతం మించడం లేదని, ‘సర్’తో పెరిగే అవకాశం ఉంటుందన్నారు. జనగణన మన కోసం, మన అభివృద్ధి కోసమని, ఇందులో ప్రతి వ్యక్తి భాగస్వామ్యం కావాలని, కచ్చితమైన సమాచారం ఇవ్వాలని కోరారు. అప్పుడే అభివృద్ధి పథకాలు, సంక్షేమంపై స్పష్టమైన ప్రణాళికలు రూపొందించే అవకాశం లభిస్తుందన్నారు. ‘మాకు ఇల్లు ఉందని చెబితే పథకాలు రాకపోవచ్చేమో, మా ఇంట్లో ఏసీ ఉందని చెబితే ప్రయోజనాలు తగ్గిపోవచ్చేమో అనే భయా లు ఎవరూ పెట్టుకోవాల్సిన అవసరం లేద’న్నారు. ఇందులో ఇచ్చే సమాచారం ఆధారంగా సంక్షేమ పథకాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని, ఇది పూర్తిగా విధానాల రూపకల్పన కోసమే ఉపయోగపడుతుందన్నారు. ఇల్లు ఉందా లేదా, రిజర్వేషన్ అర్హత వంటి అంశాలు ఇందులో పరిగణనలోకి రావని, కాబట్టి అందరూ ధైర్యంగా వివరాలు ఇవ్వాలన్నారు. జనగణన కార్యకలాపాల సం చాలకులు భారతి హోళికేరి మాట్లాడుతూ.. ప్రజలు పోర్టల్‌లో తమ సమాచారం పొందుపర్చాలని కోరారు.
మే 10న మోదీ పర్యటన ప్రతిష్ఠాత్మకం
ప్రధాని మోదీ వచ్చే నెల 10న రాష్ట్ర పర్యటనకు రానున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. సుమారు రూ.7 వేల కోట్ల విలువైన రైల్వే, హైవే ప్రాజెక్టులతో పాటు వేలాది మందికి ఉపాధి కల్పించే జహీరాబాద్ పారిశ్రామిక పార్కును ప్రధాని ప్రారంభిస్తారని చెప్పారు. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని బర్కత్‌పురాలోని బీజేపీ నగర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా రాష్ట్రానికి వస్తుండడంతో ఆయన పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామన్నారు. ఆ రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న మోదీ సభను విజయవంతం చేయాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ ప్రధాని పర్యటన విజయవంతానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.
దక్షిణాదికి రాహుల్, రేవంత్, స్టాలిన్ వెన్నుపోటు
దక్షిణాదికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, స్టాలిన్‌దేనని కిషన్ రెడ్డి విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా మహిళలకు, దళితులకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందన్నారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్ కూడా తన బాధ్యత విస్మరించి, ప్రజలను తప్పుదోవ పట్టించిందన్నారు. ఆదివారం సోమాజిగూడలోని జయా గార్డెన్స్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ అంబేడ్కర్ జయంతి ముగింపు వేడుకలో కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ప్రధాని ‘మన్ కీ బాత్’ను వీక్షించారు. అంబేడ్క ర్ స్మృతి స్థల్‌కు రెండు గజాల జాగా కూడా కాంగ్రెస్ ఇవ్వలేదని, ఆయన చనిపోతే ఢిల్లీలో అంత్యక్రియలు చేయలేదని సంజయ్ విమర్శించారు.