బొగ్గు మాయంపై విచారణ జరపండి
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:49 AM
సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైన ఘటనపై తక్షణమే విచారణ జరిపించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి కోరారు.
సింగరేణిలో నిజానిజాల నిగ్గు తేల్చండి
లేకుంటే సంస్థ ప్రయోజనాలకు విఘాతం
సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ
హైదరాబాద్,/ న్యూఢిల్లీ, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైన ఘటనపై తక్షణమే విచారణ జరిపించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి కోరారు. సింగరేణిలో అవకతవకలు జరిగాయంటూ మీడియాలో వచ్చిన కథనాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే సంస్థ ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌కు ఆయన శనివారం ఒక లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.51,500 కోట్లకు పైగా బకాయిల కారణంగా ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలో, ఇటువంటి వార్తలు సింగరేణి ఆర్థిక స్థిరత్వాన్ని మరింతగా దెబ్బ తీసే ప్రమాదం ఉందని అన్నారు. అందుకే దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమర్థ నిర్వహణ కోసం తగిన సేఫ్ గార్డ్స్, మెకానిజం, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ సరిగ్గా అమలవుతోందా అనే అంశాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సమీక్షలో టెక్నాలజీ బేస్డ్ మానిటరింగ్ టూల్స్ వినియోగించడంపై చర్చించాలని కోరారు. సమయానుగుణంగా సమీక్షలను నిర్వహించడం ద్వారా లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి, పరిష్కరించేందుకు వీలవుతుందని అన్నారు. రాష్ట్ర ఆర్థికవ్యవస్థలో సింగరేణి పాత్ర కీలకమని, ఈ సంస్థ ద్వారా 40వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని ఆయన చెప్పారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆ లేఖలో కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.