Share News

సీబీఐకి అనుమతి నిరాకరించింది కేసీఆరే

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:20 AM

నైని బ్లాక్‌పై కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? సీబీఐ దర్యాప్తు చేయిస్తారా?’ అని కొంత మంది మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో సీబీఐ ఎంక్వైరీ చేయొద్దని ఎవరు నిర్ణయించారు...

సీబీఐకి అనుమతి నిరాకరించింది కేసీఆరే

  • రాష్ట్ర అంశాల్లో సర్కారు అనుమతి లేనిదే దర్యాప్తు వద్దంటూ అసెంబ్లీలో తీర్మానం

  • ఇప్పుడేమో ‘నైని’పైసీబీఐ దర్యాప్తు కావాలంటున్నారు

  • రాష్ట్రం ఏర్పాటయ్యాకే సింగరేణికి నష్టాలబాట పట్టింది: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 22(ఆంధ్రజ్యోతి): ‘‘‘నైని బ్లాక్‌పై కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? సీబీఐ దర్యాప్తు చేయిస్తారా?’ అని కొంత మంది మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో సీబీఐ ఎంక్వైరీ చేయొద్దని ఎవరు నిర్ణయించారు? కేసీఆర్‌ కాదా? రాష్ట్రప్రభుత్వం అనుమతి లేకుండా సీబీఐ తెలంగాణలో ఏ దర్యాప్తూ చేయకూడదని వాళ్లే అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈరోజు దర్యాప్తు చేయాలని వాళ్లే అడుగుతున్నారు’’ అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి బీఆర్‌ఎ్‌సపై మండిపడ్డారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని పది సంవత్సరాలపాటు పరిపాలించిన బీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ కుటుంబం సింగరేణి సంస్థపై పూర్తిగా అజమాయిషీ చేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో బోర్డు నామమాత్రంగా ఉండేదని.. టెండర్ల దగ్గర్నుంచీ చిన్నచిన్న కాంట్రాక్టుల దాకా అన్నీ కేసీఆర్‌ కుటుంబ ఆదేశాల ప్రకారమే జరిగేవన్న విషయం సింగరేణి కార్మికులందరికీ తెలుసన్నారు. సంస్థ అప్పులు కూడా బీఆర్‌ఎస్‌ హయాంలోనే భారీగా పెరిగిపోయాయని ఆందోళన వెలిబుచ్చారు. సింగరేణి బొగ్గును వాడుకున్న జెన్‌కో, ట్రాన్స్‌కో డబ్బులు చెల్లించలేదని విమర్శించారు. రెండేళ్లుగా కాంగ్రెస్‌ పాలనలో కూడా సింగరేణికి సంబంధించి ఆర్థిక విధ్వంసం కొనసాగుతోందని విమర్శించారు. నిధుల కొరత కారణంగా సింగరేణిలో నూతన సాంకేతికతను ప్రవేశపెట్టలేకపోతున్నారని, పాత యంత్రాలతో పనిచేయడం వల్ల కార్మికులపై అదనపు భారం పడుతోందని ఆవేదన వెలిబుచ్చారు. నాగపూర్‌లోని వెస్ట్రన్‌ కోల్‌ ఫీల్డ్‌, సింగరేణి.. రెండింట్లోనూ ఉత్పత్తి స్వభావం దాదాపు ఒకేలా ఉంటుందని, కానీ నాగపూర్‌లో ఒక టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ.1,736ఖర్చు అయితే, సింగరేణిలో మాత్రం రూ.2,878ఖర్చవుతోందని తెలిపారు. ‘‘మైనింగ్‌ కారణంగా ప్రభావితమయ్యే చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలికవసతుల కల్పనకు.. డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ కింద సింగరేణి సంస్థ రూ.1500 కోట్లు జిల్లాలకు ఇవ్వాలి. కానీ.. డబ్బు లేని కారణంగా ఇవ్వలేదు’’అని వెల్లడించారు.


బోర్డు పరిధిలోనే నిర్ణయాలు..

సింగరేణిలో 49ు వాటా ఉన్నా.. ఏ రోజూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష ఆజమాయిషీ చేయలేదని, సంస్థ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే ఉందని కిషన్‌ రెడ్డి మరోసారి గుర్తుచేశారు. సింగరేణి బోర్డులో కేంద్రం తరఫున ముగ్గురు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడుగురు డైరెక్టర్లు ఉంటారని, అన్ని నిర్ణయాలూ బోర్డు పరిధిలోనే తీసుకుంటారని.. టెండర్లలో ఏ నియమాలు పెట్టారన్నది కూడా కేంద్రానికి తెలియజేయరని వెల్లడించారు. తాను సింగరేణిని కాపాడేందుకు కేంద్రం తరఫున ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఖర్చు తగ్గింపుపై నివేదిక సిద్ధం చేయించానని వెల్లడించారు. ఆ నివేదికపై సింగరేణి అధికారులతో చర్చించి, సంస్థ ఆర్థిక పరిస్థితిని సమీక్షించామని వివరించారు. ఈ అంశాలన్నింటినీ బోర్డు భేటీల్లో డైరెక్టర్లకు వివరించామని.. అప్పట్లో నైనీ బ్లాక్‌ అంశంపై ఎలాంటి చర్చా జరగలేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి బీఆర్‌ఎస్‌ హయాంలో కూడా టెండర్లు పిలిచి, మధ్యలోనే రద్దు చేశారని గుర్తు చేశారు. ‘‘టెండర్లలో సాధారణంగా ‘సైట్‌ విజిట్‌ సర్టిఫికెట్‌’ సెల్ఫ్‌ డిక్లరేషన్‌ రూపంలో ఉంటుంది. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ అథారిటీ సర్టిఫికెట్‌ తప్పనిసరి చేసింది. 17కంపెనీలు విజిట్‌ చేసినా ఒక్కరికీ సర్టిఫికెట్‌ ఇవ్వలేదు. రెండు పార్టీలూ పోటీ పడి సింగరేణిని ఇబ్బందులకు గురిచేశాయి. ఫలితంగా సంస్థ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు రెండూ అవినీతికి పాల్పడ్డాయని.. దాని మూల్యాన్ని సింగరేణి కార్మికులు చెల్లించాల్సి వస్తోందని ధ్వజమెత్తారు.

Updated Date - Jan 23 , 2026 | 04:20 AM