50 శాతం సీట్ల పెంపుతో దక్షిణాదికి నష్టమెలా?
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:54 AM
డీలిమిటేషన్‌లో భాగంగా ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్న సీఎం రేవంత్‌రెడ్డి వాదనలో శాస్త్రీయత ఏమిటని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు...
మీ వాదనకు శాస్త్రీయత ఏంటి?
సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్న
దక్షిణ భారత ప్రజల్లో విద్వేషాలు రగిల్చే ప్రయత్నమని ధ్వజం
రేవంత్ వలసవాది..కుర్చీ ఉంటుందో లేదోనని భయమని వ్యాఖ్య
హైదరాబాద్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): డీలిమిటేషన్‌లో భాగంగా ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్న సీఎం రేవంత్‌రెడ్డి వాదనలో శాస్త్రీయత ఏమిటని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. దక్షిణాదికి జరిగే అన్యాయం ఏమిటో రేవంత్‌రెడ్డి నిరూపించాలన్నారు. ‘‘మీరు చెప్పిన ఆర్థిక (జీఎ్‌సడీపీ) సూత్రం ప్రకారమే డీలిమిటేషన్ చేయాలా? మీ లెక్క ప్రకారం అంబానీ సహా ఈ దేశంలో ఎవరికి ఎన్ని లక్షల కోట్ల ఆస్తి ఉంటే.. అన్ని లక్షల ఓట్లు ఇవ్వాలా? దళితులకు, బడుగు, బలహీన వర్గాలకు ఓటుహక్కు ఇవ్వకూడదా?’’ అని ప్రశ్నించారు. ఈ మేరకు సంజయ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌లతో బీజేపీకి గుర్తింపు వస్తుందన్న ఆలోచనతో దక్షిణ భారత ప్రజల్లో విద్వేషాలు రగిల్చేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అమలు కావడం ఖాయమన్నారు. దీంతో ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున.. తన సీఎం పదవికి ముప్పు వాటిల్లుతుందన్న భయం రేవంత్‌లో కనిపిస్తోందన్నారు. ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులమైన తనను, కిషన్‌రెడ్డిని ఇష్టం వచ్చినట్లు విమర్శించడం సీఎం అహంకార ధోరణికి పరాకాష్ఠ అని మండిపడ్డారు. ఆయన నోటికి విలువ లేదని, మాటలకు హద్దులేదని మండిపడ్డారు. ‘‘యూపీఏ సర్కారు చేసిన ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 153కు మాత్రమే పెంచాలా? అత్యధిక ఆదాయం ఇస్తున్న హైదరాబాద్‌కు మాత్రమే అత్యధిక సీట్లు, ఓట్లు ఇవ్వాలా? మీరు పుట్టి పెరిగిన పాలమూరుకు, వెనుకబడ్డ ఆదిలాబాద్, ఇతర జిల్లాలకు సీట్లు పెంచాల్సిన అవసరం లేదా?’ అని సంజయ్ నిలదీశారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ సానుకూలమైతే 50 ఏళ్ల పాలనలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇందిర, సోనియాకు లబ్ధి చేకూరినంత మాత్రాన దేశంలోని మహిళలందరికీ న్యాయం జరిగినట్లా? అని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి వలసవాది అని, తాను కొన ఊపిరి ఉన్నంతవరకు బీజేపీ కార్యకర్తగానే ఉంటానని ప్రకటించారు.