Unemployed Rally: అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:36 AM
శాసనమండలిలో ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నిరుద్యోగులు భారీ ధర్నా చేపట్టారు. నిరుద్యోగ అభ్యర్థులందరికీ సర్కారు కొలువులు ఇవ్వలేమని.....
మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన
చిక్కడపల్లి సిటీసెంట్రల్ లైబ్రరీ నుంచి భారీ ర్యాలీగా అశోక్‌నగర్‌కు
అక్కడ రోడ్డుపై బైఠాయింపు
అదుపులోకి తీసుకున్న పోలీసులు
విడుదల చేయాలని జేఏసీ డిమాండ్
చిక్కడపల్లి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): శాసనమండలిలో ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నిరుద్యోగులు భారీ ధర్నా చేపట్టారు. నిరుద్యోగ అభ్యర్థులందరికీ సర్కారు కొలువులు ఇవ్వలేమని, ప్రభుత్వ రంగంలోనే ఉపాధి అవకాశాలు అంటే కుదరదని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలతో ఆందోళనకు గురైన నిరుద్యోగులు ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మెరుపు ధర్నా చేపట్టారు. ఈ మేరకు సాయంత్రం 4.40కు చిక్కడపల్లి లైబ్రరీ నుంచి అశోక్‌నగర్ చౌరస్తా వరకు ర్యాలీగా తరలివచ్చారు. ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ వారు ధర్నా చేశారు. నిరుద్యోగులను తక్కువ చేసి మాట్లాడిన మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ క్షమాపణ చెప్పాలన్నారు. కాగా నిరుద్యోగుల నినాదాలతో అశోక్‌నగర్ చౌరస్తా దద్దరిల్లింది. ఆందోళనకు దిగిన నిరుద్యోగులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీ్‌సస్టేషన్లకు తరలించారు. మరికొందరిని లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. సాయంత్రం 4.40 నుంచి 5.30 గంటల వరకు ఆందోళన కొనసాగింది. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. లాఠీచార్జిలో గాయపడిన ప్రతి నిరుద్యోగికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని, శాంతియుతంగా ధర్నా చేస్తున్న నిరుద్యోగులపై దాడి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. నిరుద్యోగుల న్యాయపరమైన డిమాండ్లపై సీఎం రేవంత్ కొనసాగిస్తున్న దమనకాండకు పోలీసుల చర్య నిదర్శనం అని ఆక్షేపించారు. కాగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను అరెస్టు చేయడం దుర్మార్గమని తెలంగాణ జాగృతి కన్వీనర్ కల్వకుంట్ల కవిత గురువారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్నారు. అరెస్ట్ చేసిన నిరుద్యోగులను వెంటనే విడుదల చేయాలన్నారు.