Underground Cable Expansion: భూగర్భ విద్యుత్తు కేబుల్‌కు రూ.4000 కోట్ల రుణం
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:43 AM
భూగర్భ విద్యుత్తు కేబుల్ పనులకు మార్గం సుగమం కానుంది. ఈ కేబుల్ విస్తరణ పనుల కోసం అయ్యే వ్యయానికి సంబంధించి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) రూ.4000 కోట్ల రుణం ఇవ్వడానికి ముందుకొచ్చింది.
సూత్రప్రాయంగా ఆర్‌ఈసీ అంగీకారం
జీహెచ్‌ఎంసీలో కేబుల్ విస్తరణకు ఇంధన శాఖ సిద్ధం!
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): భూగర్భ విద్యుత్తు కేబుల్ పనులకు మార్గం సుగమం కానుంది. ఈ కేబుల్ విస్తరణ పనుల కోసం అయ్యే వ్యయానికి సంబంధించి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) రూ.4000 కోట్ల రుణం ఇవ్వడానికి ముందుకొచ్చింది. తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణంగా ఈ సొమ్మును అందజేయడానికి రాష్ట్ర విద్యుత్తు శాఖకు అంగీకారాన్ని తెలియజేసినట్లు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో భూగర్భ కేబుల్ వేయడానికి రాష్ట్ర ఇంధన శాఖ సిద్ధమవుతోంది. ఈ మేరకు కేబుల్ నెట్‌వర్క్‌పై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తుది దశకు వచ్చిందని, త్వరలో టెండర్లను ఆహ్వానిస్తామని ఆ అధికారి వివరించారు. టెండర్లను ఆహ్వానించిన తర్వాత 3 నెలల్లో పనులను ప్రారంభిస్తామని, ఇది పూర్తి కావడానికి రెండేళ్లు పట్టొచ్చని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, గోల్కొండ విద్యుత్తు జోన్లుగా పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. కేబుల్ విస్తరణ కేవలం జీహెచ్‌ఎంసీకే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలు, పట్టణాలకు కూడా విస్తరిస్తామని తెలిపారు. ఇలాంటి పనులను కూడా ఆర్‌ఈసీ రుణంతోనే చేపడతామని చెప్పారు. కాగా, రాష్ట్రంలో ఏర్పాటు చేయతలపెట్టిన మూడో విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం) ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని వివరించారు. ప్రభుత్వ శాఖలు, సంస్థల నుంచి రావాల్సిన బకాయిలన్నింటినీ ఈ మూడో డిస్కంకు బదిలీ చేస్తామని వివరించారు. తద్వారా రాష్ట్రంలోని మిగతా రెండు తెలంగాణ ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎన్‌పీడీసీఎల్), తెలంగాణ దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎ్‌సపీడీసీఎల్)’లు ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధిస్తాయని తెలిపారు. వీటికి క్రెడిట్ రేటింగ్ పెరిగి, మరిన్ని రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంటుందని వివరించారు.