kumaram bheem asifabad- యాసంగి సాగు సందిగ్ధం
ABN , Publish Date - Oct 16 , 2026 | 10:24 PM
ఈ ఏడాది యాసంగి సాగుపై సందిగ్ధం నెలకొన్నది. రాష్ట్రంలో ప్రస్తుతం సూపర్ ఎల్నినో పరిస్థితులు నెలకొన్నాయని, సాగునీటి, తాగునీటి ఎద్దడి తలెత్తుతోందని, రైతులు పెద్దమనసు చేసుకుని యాసంగిలో పంట వేయకుండా వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది.
- పంట వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం సూచన
చింతలమానేపల్లి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది యాసంగి సాగుపై సందిగ్ధం నెలకొన్నది. రాష్ట్రంలో ప్రస్తుతం సూపర్ ఎల్నినో పరిస్థితులు నెలకొన్నాయని, సాగునీటి, తాగునీటి ఎద్దడి తలెత్తుతోందని, రైతులు పెద్దమనసు చేసుకుని యాసంగిలో పంట వేయకుండా వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. ఎల్నినో కారణంగా ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు, మండుతున్న ఎండలు, తగ్గి న భూగర్భ జలాలతో వానా కాలం వరి పంట చేతికివచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. మరో 15 రోజుల నుంచి నెలరోజుల్లో రెండు లేక మూడు తడులు నీరందితే తప్ప వరి పొలాలు ఆశించిన దిగుబడి ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
- జిల్లాలో పరిస్థితి ఇలా..
జిల్లాలో 4.6 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈ సారి కూడా జిల్లాలో పత్తి సాగుదే సింహభాగం. జిల్లాలో 3.70లక్షల ఎకరాల్లో పత్తి సాగవు తోంది. ఆ తర్వాత వరి 47,228ఎకరాలు, మొక్కజొన్న 7,668, పప్పు ధాన్యాలు 21,054, ఇతర పంటలు 5,712ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వానలు ముఖం చాటేయడంతో పంట కళ్లముందే ఎండిపోయే దశకు చేరడంతో రైతులు ఆవేదన చెందు తున్నారు. కాగా జిల్లాలో ఈసారి లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఈ ఏడాది. 30.3శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది వర్షాకాలంలో ప్రారంభం నుంచే అన్నదాతకు అన్నికష్టాలే ఎదుర య్యాయి. తొలకరి వర్షాలకు విత్తనాలు పెట్టిన రైతులు వర్షాలు లేక పోవడంతో మరో సారి పెట్టాల్సిన పరిస్థితి వల్ల పెట్టుబడి పెరిగిపోయింది. అడపాదడపా కురిసిన వర్షాలకు రెండు నెలల పాటు పంటలు చేతికందుతా యని అన్నదాతలు భావించారు. కానీ సెప్టెంబరు, అక్టోబరులో సైతం భా రీ వర్షాలు లేకుండా పోయాయి. దీంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందో ళన చెందుతున్నారు. సరైన వర్షాలు కురిసినట్లయితే పంటలకు ఎలాంటి డోకా లేకుండా ఉండేద కాదని రైతులు చెబుతున్నారు. ఈ నెలలోనైనా ఒకవర్షం కురసినట్లయితే పత్తి చేతికి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
- పెట్టుబడులు సైతం..
ఈ ఏడాది వర్షాకాలంలో సాగు చేసిన పంటలు సైతం వర్షాలు లేక ఎండిపో వడంతో పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. వర్షాధారం పైనే ఆధారంగా పంటలు పండిస్తుండడం తో వరి పంటలకు నీరు సరిగ్గా అందక ఈ సారి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రైతులు ఆవేదన చెందుతు న్నారు. ఈ పరిస్థితుల్లో యాసంగిలో కనీసం పప్పు ధాన్యాలు, ఆరుతడి పంటలు సైతం వేసే అవకాశం కనిపించడం లేదు. జిల్లాలో మోటార్ల సదుపాయం ఉన్న చోట తప్ప ఇతర ప్రాంతాల్లోని రైతులు పండించిన వరి పంట పూర్తిగా పొట్ట దశకు వచ్చింది. ప్రస్తుతం సరిపడా నీరు అందక ఎండిపోయే దశకు చేరుకున్నది. వర్షాలు కురిసే పరిస్థితి లేక పోవడంతో ఈ సారి వరి పంట పూర్తిగా చేతికందే దశలోనే ఎండిపోయేట్టు ఉందని రైతులు చెబుతు న్నారు. వానాకాలంలో వేసిన పంటే చేతికి అందే పరిస్థితి లేదని, మళ్లీ యాసంగిలో పంటల పరిస్థితిపై పెద్దగా ఆసక్తి చూపించని పరిస్థితి నెలకొన్నది.