కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్‌కు పద్మ భూషణ్
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:59 AM
ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. దేశ ఆర్థిక, బ్యాంకింగ్ రంగాలకు చేసిన సేవలకు గుర్తింపుగా ఉదయ్ కోటక్‌ను 2026 సంవత్సరానికి గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
న్యూఢిల్లీ: ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. దేశ ఆర్థిక, బ్యాంకింగ్ రంగాలకు చేసిన సేవలకు గుర్తింపుగా ఉదయ్ కోటక్‌ను 2026 సంవత్సరానికి గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 1982లో కోటక్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ (అనంతరం కోటక్ మహీంద్రా ఫైనాన్స్) పేరుతో ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎ్‌ఫసీ)ని స్థాపించి 2003లో దాన్ని పూర్తి స్థాయి ప్రెవేట్ బ్యాంకుగా మార్చి అనేక ఆర్థిక సేవల రంగాల్లోకి విస్తరించారు. 2014లో ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్‌ను కొనుగోలు చేయటంలో ఉదయ్ కోటక్ కీలక పాత్ర పోషించారు. అనంతరం కోటక్ గ్రూప్ 2015లో సాధారణ బీమా వ్యాపారంలోకి అడుగుపెట్టింది. కాగా బ్యాంక్ సీఈఓ పదవి నుంచి తప్పుకున్నా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఇప్పటికీ కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు ఉదయ్ కోటక్ మార్గదర్శకత్వం వహిస్తున్నారు. కాగా, కిచెన్ మొఘల్‌గా ప్రసిద్ధి చెందిన టీటీకే ప్రెస్జీజ్ గ్రూప్ చైర్మన్ (ఎమిరెటస్) టీటీ జగన్నాథన్ ఈ ఏడాది పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. మరణానంతరం ఆయనకు ఈ పురస్కారం ప్రకటించారు. గత ఏడాది అక్టోబరులో ఆయన 77 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా జగన్నాథన్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి.