తాళికట్టు.. శుభవేళ..
ABN , Publish Date - Aug 13 , 2026 | 01:08 AM
శ్రావణ మాసం పెళ్లి సందళ్లు మొదలయ్యాయి.. కల్యాణం, కమనీయం.. అంటూ వాట్సాప్ స్టేటస్స్‌లతో మోగిపోనున్నాయి. శ్రావణమాసం గురువారం ప్రారంభమవుతుండగా, 16 నుంచి సెప్టెంబర్ 10వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివాహాల కోలాహలం కనిపించనున్నది. బంధుమిత్రుల సమక్షంలో రెండు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
శ్రావణ మాసం పెళ్లి సందళ్లు మొదలయ్యాయి.. కల్యాణం, కమనీయం.. అంటూ వాట్సాప్ స్టేటస్స్‌లతో మోగిపోనున్నాయి. శ్రావణమాసం గురువారం ప్రారంభమవుతుండగా, 16 నుంచి సెప్టెంబర్ 10వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివాహాల కోలాహలం కనిపించనున్నది. బంధుమిత్రుల సమక్షంలో రెండు మనస్సులు.. మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోయే క్షణాల కోసం ముందస్తు ఏర్పాట్లలో కుటుంబాలు బిజీబిజీగా మారిపోయాయి.
శుభ ముహూర్తాలు ఇవే...
ఈనెల 13 నుంచి శ్రావణమాసం ప్రారంభం కావడంతోనే మంచి ముహూర్తాలు వస్తున్నాయి. ఆగస్టులో 16,17,20,21,22,23,26,27,28,29,30, సెప్టెంబర్‌లో 3,4,5,8,10 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉండడంతో ఎక్కువ పెళ్లిళ్లు జరపడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతోపాటు గృహప్రవేశాలు, పిల్లలకు కేశఖండనలు, ఉపనయనాలు, నిశ్చితార్థం, ఇతర వ్యాపార సంబంధమైన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 11న శ్రావణం పూర్తి కావడంతోనే భాద్రపద మాసం ప్రారంభం అవుతుండటంతో శుభకార్యాలు నిర్వహించరు. ఆశ్వయుజ, కార్తీక మాసాల వరకు ఆగాల్సిందే. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెండ్లి సందడి మొదలైంది. వీటి కోసం ఇప్పటికే ఫంక్షన్‌హాళ్ల నుంచి మొదలుకొని క్యాటరింగ్, పెండ్లి మండపాలు, బ్యాండ్ మేళాలు, పురోహితుల వరకు బుకింగ్‌లు జరిగిపోతున్నాయి. ఆభరణాలు, వస్త్రాల దుకాణాల్లో పెండ్లి సందడి మొదలైంది. మరోవైపు హంగామా... ఆర్భాటాలు... మూడు ముళ్ల బంధం మూడు తరాలు చెప్పుకునే విధంగా ఖర్చుకు వెనుకాడడం లేదు. ఎట్రాక్షన్ కోసం పాత కాలపు సంప్రదాయాలను చూపుతున్నారు. ప్రత్యేకతను చాటుకోవడానికి వివాహ వేడుకల్లో కొత్తకొత్త అంశాలు చేరుస్తున్నారు. వెడ్డింగ్ కార్డు నుంచి భోజనాల ప్లేట్ల వరకు ఏకోప్రెండ్లీని జత చేస్తున్నారు. ఇక భారీ సెట్టింగ్‌లు.. సెలబ్రెటీల డ్యాన్స్‌లు.... సంగీతం... అతిథులకు పోటీలు... పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు పెండ్లి ఒక పవిత్ర బంధంగా ఆరురోజుల పాటు జరిపించేవారు. ఇప్పుడు అరరోజుకు పరిమితం చేశారు. గతంలో పెళ్లి ఉందంటే బంధుమిత్రులందరు కలిసి వారం రోజుల పాటు ఇంట్లో సందడి చేస్తూ అందరు కలిసి వంటలు చేయడం, వంట వాళ్లు వస్తే వారికి సహాయం చేసేవారు. కానీ ఇప్పుడు అంతా క్యాటరింగ్ పద్ధతే వచ్చింది.
స్టేటస్ సింబల్‌గా వేడుకలు
చివరకు సంప్రదాయ బద్ధంగా సాగిపోయే పెళ్లి వేడుక స్టేటస్ సింబల్‌గా మారింది. పెళ్లి కూడా ఒక వ్యాపారంలో భాగంగా సంతరించుకుంది. పెళ్లి కూతురు ధరించే దుస్తుల దగ్గర నుంచి ఆమెను అత్తవారింటికి పంపే వరకు, పెళ్లి కొడుకుకు కావాల్సిన వస్తువులను, మండపం అలంకరణలు.. ఇలా ప్రతి ఒక్కటి చేసి పెట్టడానికి ఎన్నో సంస్థలు వచ్చాయి. ఇప్పుడు ఒక పెళ్లి ఖర్చు రూ 20లక్షల నుంచి రూ.50లక్షల వరకు కూడా అవుతుంది. పెళ్లి పనులు చేసి పెట్టేందుకు మనుషులు రెడిమేడ్‌గా లభిస్తున్నారు. చివరకు పెళ్లి కూతురు బంధువులు పట్టుకురావాల్సిన పెళ్లి వస్తువులు కూడా రెడిమేడ్‌గా వచ్చే అమ్మాయిలే రకరకాల వస్త్రాలు ధరించి మోసుకెళుతున్నారు.
ప్యాకేజీలతోనే పెళ్లిళ్లు...
పెళ్లలంటే బోలెడన్ని పనులు... బంధువులు ఉండడానికి ఏర్పాట్లతో తలమునకలు.. భోజనాలు.. ఇతర పనులకోసం పరుగులెత్తే పరిస్థితి. ముహూర్తం రోజు దగ్గర పడితే మరీ హడావుడి. మారుతున్న కాలంతో పాటు పెళ్లి పనులు మారిపోయాయి. కూర్చున్న చోటే ఒక్క ఫోన్‌కాల్‌తో పనులన్నీ ప్యాకేజీ రూపంలో మ్యారేజ్ ప్లానర్స్ సిద్ధం చేసి పెడతారు. మన హంగామాకు తగ్గట్టుగా మ్యారేజ్ ప్లానర్స్ వివిధ రకాల ప్యాకేజీలను అందిస్తున్నారు. పెళ్లి కావాల్సిన ఏర్పాట్లన్ని చేసిపెడితే సర్వీస్ చార్జీ చెల్లిస్తే సరిపోతుంది. పెళ్లి వేడుకను నిర్వహించడానికి వచ్చిన సంస్థలు ఇప్పుడు కోట్లలోనే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. పెళ్లి పందిరి నుంచి పెళ్లి భోజనాలు, ఫుడ్‌స్టాల్స్, వెడ్డింగ్ కార్డ్స్, పెళ్లి ఫోటోలు, ఊరేగింపుతోపాటు పెళ్లికి కావాల్సిన దుస్తులు డిజైన్ చేస్తుంటారు. నగలే కాదు అబ్బాయి, అమ్మాయిలకు వేసుకోవాల్సిన నగలు, రింగ్స్, చేతికి పెట్టుకునే మెహందీ, చివరకు చెప్పులను కూడా వారే ఎంపిక చేస్తున్నారు. మ్యారేజ్ ప్లానర్స్ వివిధ రకాల కళాకారులను కూడా పెళ్లిలో ఉపయోగిస్తారు. గతంలో పెళ్లిళ్లను కల్యాణ మండపాల్లోనే నిర్వహించే వారు. ఆ పరిస్థితి కూడా మారిపోయింది. మైదాన ప్రాంతంలో రకరకాల సెట్టింగ్‌లను వేస్తున్నారు. పెళ్లిల్లో మహిళలు పాటలు పాడడం, డ్యాన్సులు చేయడం వంటివి నిర్వహిస్తున్నారు. వీరు మ్యారేజ్‌కు వచ్చే ఒక వ్యక్తిపై వెయ్యి రూపాయల వరకు చార్జీ చేస్తారు. ఎంత వైభవంగా పెళ్లి జరిపించాలన్నా వీరు సిద్ధమే. భోజనాల విషయానికి వస్తే బాస్మతి బియ్యంతో బిర్యానీ, మటన్, చికెన్, స్వీట్‌తోపాటు వివిధ ఆహార పదార్థాలతో ప్లేట్ పూర్తిగా నిండి పోతుంది. భోజనం ముగిసిన తరువాత రకరకాల సూప్‌లు, రకరకాల చిరుతిళ్ల స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
హంగామాల మధ్య దూరమవుతున్న అప్యాయతలు..
పెళ్లి స్టేటస్ సింబల్‌గా మారిపోయిన క్రమంలోనే బంధుత్వాలు కూడా దూరమైపోతున్నాయి. సమయానికి పెళ్లి వేడుకకు వచ్చి వెళ్లిపోతున్న బంధుత్వాలే కనిపిస్తున్నాయి. అక్కచెల్లెళ్ల ఆప్యాయతలు, అన్నదమ్ముల ఆనందాలు, బావమరదళ్ల చిలిపి మాటలు, వదినమరదళ్ల సరదాలు, మామా, తాత, బావ, మనవడు.. ఇలాంటి పిలుపులే ఇప్పుడు పెళ్లిల్లో వినిపించకుండా పోతున్నాయి. లక్షలు ఖర్చు చేసి ఆర్భాటాలు చేస్తున్నా ఆప్యాయతలను మాత్రం హృదయాల్లో నిలుపుకోలేకపోతున్నారు.
ఫోటో జ్ఞాపకాలకు లక్షల్లో ఖర్చు..
ప్రతి కుటుంబంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన వేడుక ఘట్టం... పెళ్లంటే నూరేళ్ల పంటగా కల్యాణం కమణీయంగా ఉత్సాహాన్ని నింపుతుంది. పెళ్లి తంతుకోసం దూరతీరాల్లో ఉన్న బంధువులు స్నేహితులు తరలివస్తారు. అలాంటి ముఖ్య తంతును, మధుర స్మృతులను భద్రపరిచేది ఫొటో ఆల్బమ్. ఇప్పుడు పెళ్లి పుస్తకంగా మన ముందుకు వచ్చింది. వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ఒక ప్రత్యేకతగా నిలిచింది. ఎన్నో జ్ఞాపకాలను, పెళ్లిలో చేసే సందడిని సైతం అద్భుతంగా చిత్రీకరించి ఫొటో ఆల్బమ్స్ రూపంలో అందిస్తున్నారు. కేవలం వఽధూవరుల పెళ్లి తతంగమే కాకుండా వేడుకకు వచ్చిన బంధువులు, మిత్రుల భావోద్వేగాలను సైతం అందంగా చిత్రీకరిస్తున్నారు. గతంలో పెళ్లి ఫోటోలంటే ఒక చోట నిలబడి తీసేవిగా కనిపించేవి ఇప్పుడు అనేక మార్పులు వచ్చాయి. వారి కదలికలను బట్టి ఫొటోలు తీస్తున్నారు. పెళ్లిళ్లు జరిగే రకరకాల ఆచార వ్యవహారాలను సైతం అందిస్తున్నారు.