రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు
ABN , Publish Date - Jul 11 , 2026 | 05:58 AM
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒక్కచోటే ఓటు ఉండాలని.. అలాకాకుండా రెండు, అంతకన్నా ఎక్కువ చోట్ల ఓటు ఉంటే అది చట్టవిరుద్ధమని..
ఉద్దేశపూర్వకంగా అలా పొంది ఉంటే శిక్ష, జరిమానా
ఓటర్లంతా ‘సర్’లో పాల్గొని ఓటుహక్కును రక్షించుకోవాలి
ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి ఇవ్వాల్సిందే
ముఖ్యమంత్రికైనా, ప్రధానికైనా మినహాయింపు లేదు
ఎన్యూమరేషన్ ఫారం అందకుంటే.. ఫారం-6 ఇవ్వొచ్చు
గ్రామాల్లో వేగంగా ‘సర్’.. పట్టణాల్లో చిరునామా సమస్య
బీఎల్‌వోలకు అవగాహన లేకనే ఫారాల పంపిణీ ఆలస్యం
తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒక్కచోటే ఓటు ఉండాలని.. అలాకాకుండా రెండు, అంతకన్నా ఎక్కువ చోట్ల ఓటు ఉంటే అది చట్టవిరుద్ధమని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సి.సుదర్శన్ రెడ్డి తెలిపారు. అలా ఉంటే ఏడాది జైలు శిక్ష, జరిమానా పడుతుందని హెచ్చరించారు. శుక్రవారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో.. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియకు సంబంధించిన సందేహాలకు సమాధానాలిచ్చారు. రాష్ట్రంలోని ఓటరు జాబితా ఆధారంగా.. ఎవరికైనా రెండు చోట్ల ఓటు ఉంటే, తాము గుర్తించగలుగుతామని.. అదే రెండు రాష్ట్రాల్లో ఉంటే దాన్ని ఈసీఐ గుర్తించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ‘డెమోగ్రాఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్’ (డీసీఈ) అనే అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చిందని చెప్పారు. దానిద్వారా.. ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓట్లు ఉన్నట్లు గుర్తిస్తే, విచారణ జరిపి చర్యలు తీసుకుంటారన్నారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి రెండు చోట్లా ఓటుహక్కు పొందినవారికి ఈసీఐ జారీచేసే నోటీస్ ఆధారంగా... ఏడాది జైలు శిక్షతో పాటు పెనాల్టీ కూడా పడుతుందని సీఈవో హెచ్చరించారు. ‘సర్’ ముఖ్య ఉద్దేశం.. ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లను తొలగించడం, ఇతర తప్పులను సరిదిద్ది జాబితాను పూర్తిస్థాయిలో శుద్థి చేయడమేనని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ముగిసిందని.. ప్రస్తుతం తెలంగాణతో పాటు పంజాబ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర 17 రాష్ట్రాల్లో జరుగుతోందని తెలిపారు. ఓటర్లందరూ ఈ ప్రక్రియలో పాల్గొని తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్క ఓటరూ ఈ ప్రక్రియలో పాల్గొనాల్సిందేనని.. సాధారణ పౌరుల నుంచి సీఎం, పీఎం దాకా ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారం నింపాల్సిందేనని.. ఎవరికీ మినహాయింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు.
రెండు ఫారాలు..
రాష్ట్రంలో జూన్ 10నాటికి 3.36 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారని.. వారందరికీ బీఎల్‌వోల ద్వారా రెండేసి ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తున్నామని సీఈవో తెలిపారు. ఆ రెండింటిలో ఒక పత్రాన్ని నింపి బీఎల్‌వోకు ఇవ్వాలని.. రెండో పత్రాన్ని ప్రజలు తమవద్దే ఉంచుకోవాలని చెప్పారు. ఎన్యూమరేషన్ పత్రాన్ని నింపి ఇస్తేనే ముసాయిదా ఓటరు జాబితాలో పేరు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ‘‘నేను 30 ఏళ్లుగా ఓటు వేస్తున్నాను.. ప్రతి నెల బిల్లులు కడుతున్నాను కదా’’ అనే లాజిక్‌ను కమిషన్ అంగీకరించదని, ఎన్యూమరేషన్ ఫారం నింపి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే డ్రాఫ్ట్ రోల్‌లో ఉంటాయని తేల్చిచెప్పారు. ఓట్లను కుట్రపూరితంగా తొలగిస్తున్నారనే రాజకీయ ఆరోపణలను సీఈవో తోసిపుచ్చారు. ఓటరుకు సమాచారం ఇచ్చిన తర్వాతే ఓటు తీసేయాల్సి ఉంటుందని.. ఓటును ఉద్దేశపూర్వకంగా తొలగించే పరిస్థితి ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఓటు తొలగించడం ఆషామాషీ విషయం కాదని పేర్కొన్నారు. ఒకవేళ అలా చేయాల్సి వస్తే.. ఎందుకు తొలగిస్తున్నామో వివరిస్తూ ఈఆర్‌వో ఒక ‘స్పీకింగ్ ఆర్డర్’ (వివరణాత్మక ఉత్తర్వు) ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇది చాలా బాధ్యతాయుతమైన ప్రక్రియ అని చెప్పారు. పొరపాటున ఎవరి ఓటైనా తొలగిస్తే.. వారు కలెక్టర్, సీఈవోకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
ఫారం అందకుంటే..
బీఎల్‌వోలు ఇంటికి రాకపోయినా, ఎన్యూమరేషన్ ఫారం అందకపోయినా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఓటర్లు స్వయంగా ఓటర్స్.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో (లేదా) ఈసీఐ.నెట్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని, వివరాలను సైతం పరిశీలించుకోవచ్చని చెప్పారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు ఫారం-6ను ఉపయోగించాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా ఈ గడువులోగా ఫారం నింపలేకపోయినా, ముసాయిదా జాబితాలో పేరు రాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అటువంటి వారు ఆగస్టు 1 నుంచి ఫామ్-6 (కొత్త ఓటు కోసం) లేదంటే.. ఫామ్-8 (వివరాల మార్పుల కోసం) ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని సుదర్శన్‌రెడ్డి వివరించారు.
పరిచయాలు లేకపోవడంతో..
గ్రామీణ ప్రాంతాల్లో ఓటరు అడ్రస్ గుర్తింపు, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ 90శాతానికి పైగా పూర్తికాగా, హైదరాబాద్‌లో 45 శాతం, మేడ్చల్‌లో 42 శాతం మాత్రమే పూర్తయిందని సీఈవో తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో అడ్ర్‌సలు స్పష్టంగా లేకపోవడం వల్ల బీఎల్‌వోలు ఇళ్లను గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులకు తమ ప్రాంతంపై పట్టు ఉండటంవల్ల అక్కడ ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. పట్టణాల్లో మాత్రం కొత్తగా నియమితులైన గ్రూప్-సి ఆఫీసర్లకు ఆ పరిచయం లేకపోవడం ఒక సమస్య అని ఆయన పేర్కొన్నారు.
అక్రమ నివాసితులకు నోటీసులు..
రోహింగ్యాల వంటి అక్రమ నివాసితులు ఆధార్, బ్యాంక్ అకౌంట్లతో ఓటర్ల జాబితాలో చేరుతున్నారనే ఆందోళనలపై స్పందించిన సీఈవో.. అటువంటి వారు ఎక్కువగా ఉంటున్న అనుమానిత ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. అలాంటివారికి నోటీస్ జారీ చేయడంతోపాటు విచారణ సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుని వారిని ఫిల్టర్ చేస్తామని హామీ ఇచ్చారు. 2002 నాటి వివరాలు లేనివారి విషయంలో నోటీసు పీరియడ్‌లో క్షుణ్నంగా విచారణ జరుగుతుందని తెలిపారు.
ఉర్దూలోనూ ఎన్యుమరేషన్ ఫారాలు
ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఓటర్ల సౌకర్యార్థం ఉర్దూలో ఫారాలు అందుబాటులోకి తెచ్చామని.. వారు ఉర్దూలోనూ వివరాలు నమోదు చేసుకోవచ్చని సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, నిజామాబాద్ వంటి పట్టణాల్లో 20 శాతం కంటే ఎక్కువ మంది ఉర్దూ మాట్లాడే వారు ఉన్నందున.. ఆ భాషలో కూడా ఎన్యూమరేషన్ ఫారాలను ముద్రించి ఇవ్వాలని ఈసీఐ ఆదేశించిందని, అందుకు అనుగుణంగా ఈ ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.