వరంగల్‌లో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అరెస్టు
ABN , Publish Date - Apr 21 , 2026 | 04:22 AM
అక్రమ రిజిస్ట్రేషన్లు, లంచాల ఆరోపణలపై వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల తనిఖీలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ ...
అవినీతి ఆరోపణలతో ఇటీవల ఏసీబీ తనిఖీలు
ఆధారాలు బయటపడడంతో రిమాండ్‌కు
హనుమకొండ టౌన్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): అక్రమ రిజిస్ట్రేషన్లు, లంచాల ఆరోపణలపై వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల తనిఖీలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ నెల 2న ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో సుమారు 20 మంది అనధికార డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్లు విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అలాగే ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు దావులూరి ఆనంద్, జమలాపురం రామనర్సింహరావు ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించి అనధికారిక నగదు, బంగారం నిల్వలను సీజ్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వారి మొబైల్ ఫోన్లలో లభించిన రోజువారి వసూళ్లు, వాట్సాప్ చాట్‌లు, ఫోన్‌పే లావాదేవీల ఆధారంగా వారి అక్రమ వసూళ్ల దందా బయటపడడంతో ఏసీబీ అధికారులు నిందితులను అరెస్టు చేశారు. రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.