Speaker Gadam Prasad Kumar: మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్!
ABN , Publish Date - Jan 17 , 2026 | 05:38 AM
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ క్లీన్‌చిట్ ఇచ్చారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యలపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు.
పోచారం శ్రీనివాసరెడ్డి, కాలె యాదయ్యలు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే
వారు పార్టీ మారినట్లు ఆధారాల్లేవు: స్పీకర్
అనర్హత పిటిషన్ల కొట్టివేత
దానం ‘అనర్హత’పై సుప్రీంకోర్టుకు బీజేపీ
స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ
పిటిషన్ దాఖలు చేసిన బీజేఎల్పీ నేత ఏలేటి
హైదరబాద్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ క్లీన్‌చిట్ ఇచ్చారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యలపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. వారిద్దరూ పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని స్పష్టం చేశారు. వారిని బీఆర్‌ఎస్ పార్టీ సభ్యులుగానే పరిగణనలోకి తీసుకున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. పార్టీ మారినట్లు ఆధారాలు సమర్పించడంలో ఫిర్యాదుదారులు విఫలమైనట్లు తెలిపారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి పనుల నిమిత్తమే ముఖ్యమంత్రిని కలిసినట్లు వివరించారన్నారు. సాంకేతికంగా వారిప్పటికీ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే ఉన్నారని వెల్లడించారు. ఇదే ఆరోపణలున్న ఐదుగురు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, ప్రకాశ్‌గౌడ్, తెల్లం వెంకట్రావ్‌లను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తూ స్పీకర్ గతంలోనే తీర్పిచ్చారు. దీంతో ఇప్పటివరకు ఏడుగురిపై విచారణ పూర్తయింది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్‌లపై విచారణ కొనసాగుతోంది. పార్టీ ఫిరాయించిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలకూ స్పీకర్ క్లీన్‌చిట్ ఇవ్వడం కాంగ్రెస్ అప్రజాస్వామ్య పాలనకు నిదర్శనమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
కాలె యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిపై వేటు వేయాల్సిన స్పీకర్ వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లతో కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టించిందన్నారు. పార్టీ మారినట్లు కళ్ల ముందు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా, ఆధారాలు లేవనడం శాసనసభను అవమానించడమేనని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ వణికిపోతోందని, అందుకే వారిపై చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. ప్రజా తీర్పును అవమానించిన జంప్ జిలానీలకు, వారికి కాంగ్రెస్ కండువాలు కప్పిన రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పేవరకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. కాగా, కేసీఆర్ హయాంలో ప్రారంభమై, 90 శాతానికిపైగా పనులు పూర్తిచేసుకున్న 2 సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభం కావడం సంతోషదాయకమని కేటీఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇవ్వడం రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఓ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్న పోచారం ఇంకా బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నారని స్పీకర్ తీర్పునివ్వడం శోచనీయవన్నారు.