పంక్చర్ టైర్ మారుస్తుండగా దూసుకొచ్చిన మృత్యువు
ABN , Publish Date - Apr 04 , 2026 | 05:06 AM
యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది.
కంటైనర్ ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం
ఇద్దరికి తీవ్ర గాయాలు.. మృతులిద్దరిదీ ఏపీలోని ఏలూరు
చౌటుప్పల్ రూరల్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కొబ్బరిబొండాల లోడుతో వెళ్తున్న గూడ్స్ వాహనాలను వెనుక నుంచి కంటైనర్ ఢీకొన్న ఘటనలో ఏపీకి చెందిన ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏపీలోని ఏలూరు జిల్లా కామవరపుకోట మండ లం జలపవారిగూడెంకు చెందిన లక్ష్మీనరసింహస్వామి(25), నవీన్‌కుమార్ (27), కనకరాజు, నాగపోగుల కృష్ణ 4 గూడ్స్ వాహనాల్లో కొబ్బరిబొండాలతో గురువారం హైదరాబాద్‌కు బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున దండుమల్కాపురం జాతీయ రహదారి వద్దకు రాగానే లక్ష్మీనరసింహస్వామి నడుపుతున్న వాహనం టైరు పంక్చర్ అయింది. దీంతో వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేసి, అందరూ కలిసి టైరు మారుస్తున్నారు. అదే సమయంలో కర్ణాటక వైపు వెళ్తున్న ఓ కంటైనర్ ఆ వాహనాలను ఢీకొట్టింది. లక్ష్మీనరసింహస్వామి మృతి చెందగా.. తీవ్ర గాయాలపాలైన నవీన్‌కుమార్, కనకరాజు, కృష్ణలను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం నవీన్ మరణించాడు.