Share News

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:27 AM

సూర్యాపేట జిల్లా మోతె మండలకేంద్రంలోని జాతీయ రహ దారిపై గురువారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత
ప్రమాదానికి కారణమైన టిప్పర్‌

గంటల వ్యవధిలో ఇరు గ్రామాల్లో విషాదం

టిప్పర్‌ ఢీకొని ఒకరు.. కారు బోల్తాపడి మరొకరు

మోతె, మార్చి 5(ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా మోతె మండలకేంద్రంలోని జాతీయ రహ దారిపై గురువారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. పక్క పక్క గ్రామాలకు చెందిన వారు గంటల వ్యవధిలోనే రోడ్డుకు ఇరు వైపులా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందడంతో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మోతె మండలం గోల్‌తండాకు చెందిన దరావత్‌ హజ్యా(38), దరావత్‌ మంగత్య బతుకు దెరువుకోసం కొన్ని సంవత్సరాలుగా గోల్‌ తండా నుంచి ఉదయం ఆటో నడిపేందుకు సూర్యాపేటకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేవారు. ఆరునెలల నుంచి ఆటో నడవకపో వడంతో ఇద్దరూ కలిసి భవననిర్మాణ పనులకు వెళ్తున్నారు. హజ్యా, మంగత్య రోజుమాదిరిగానే గోల్‌తండా నుంచి ఉదయం బైక్‌పై సూర్యా పేటకు వెళ్తుండగా మోతె మండలకేంద్రంలో ఉన్న సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారి వెంబడి ఉన్న అండర్‌పాస్‌ నుంచి సూర్యాపేట వైపు వెళ్తుండగా టిప్పర్‌ అతివేగంతో వచ్చి బైక్‌ను ఢీకొంది. దీంతో వారు సర్వీస్‌రోడ్డు వెంట ఉన్న కల్వర్టుపై పడిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని పోలీసులు 108సహాయంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తర లించారు. హజ్యా పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం తరలిస్తుంగా మార్గమధ్యలో మృతిచెందాడు. హజ్యకు భార్య, ఇద్దరు పిల్లలు, ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అజయ్‌కుమార్‌ తెలిపారు. హజ్య మృతితో తండాలో విషాదం నెలకొంది.

కారు కల్వర్టును ఢీకొని...

అదే రోడ్డుపై ఉదయం జరిగిన ఈ సంఘటన మరవకముందే గోల్‌తండాకు పక్కనే ఉన్న బుర్కచర్ల గ్రామానికి చెందిన వ్యక్తి కారు సర్వీస్‌రోడ్డుకు ఆనుకుని ఉన్న డివైడర్‌ను ఢీకొని మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుర్కచర్లకు చెందిన కోట మహేందర్‌రెడ్డి(66) ఉదయం గ్రామం నుంచి చిలుముల సత్తిరెడ్డితో కలిసి నకిరేకల్‌లో శుభకార్యానికి వెళ్లి తిరిగి ఇద్దరు కారులో వస్తున్నారు. సూర్యాపేట నుంచి వస్తుండగా మోతె గ్రామంలోకి హైవే నుంచి కిందకు వచ్చే క్రమంలో సర్వీస్‌రోడ్డును దాటి ముందుకు వెళ్లగా తిరిగి వెనకకు వస్తున్న క్రమంలో సర్వీస్‌రోడ్డు దిగుతుండగా కారు వేగం అదుపు కాకపోవడంతో రోడ్డు వెంట ఉన్న కల్వర్టును ఢీకొని కారు పల్టీలు కొట్టింది. వెంటనే స్థానికులు నేషనల్‌ హైవే సిబ్బంది, పోలీసుల సహాయంతో కారులో ఉన్న ఇద్దరినీ సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతుండగా కారు డ్రైవింగ్‌ చేస్తున్న కోట మహే ందర్‌రెడ్డి మృతిచెందాడు. చిలుముల సత్తిరెడ్డి చికిత్స పొందుతున్నాడు. మహేందర్‌రెడ్డి భార్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. కుమారుడు హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. గ్రామంలో పొలాలను కౌలుకు ఇచ్చి ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్నాడు. గంటల వ్యవధిలోని పక్క పక్క గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందడంతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. ఇద్దరి కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Mar 06 , 2026 | 12:27 AM