kumaram bheem asifabad-ఒకే పేరుతో ఇద్దరు లబ్ధిదారులు
ABN , Publish Date - Feb 13 , 2026 | 11:43 PM
గ్రామీణ పేదలకు గృహవసతి కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అధికారుల నిర్లక్ష్యం బహిర్గత మైంది. లబ్ధిదారులకు అందాల్సిన నిధులు అధికారుల పొరపాట్లతో వేరు వారి ఖాతాలో జమ అవుతుండడంతో అసలైన వారు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఒకే పేరుతో ఉన్న ఇద్దరు మహిళా లబ్ధిదారుల్లో ఇల్లు మంజూరు ఒకరికి కేటాయించారు.
- అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థులు ఆగ్రహం
వాంకిడి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ పేదలకు గృహవసతి కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అధికారుల నిర్లక్ష్యం బహిర్గత మైంది. లబ్ధిదారులకు అందాల్సిన నిధులు అధికారుల పొరపాట్లతో వేరు వారి ఖాతాలో జమ అవుతుండడంతో అసలైన వారు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఒకే పేరుతో ఉన్న ఇద్దరు మహిళా లబ్ధిదారుల్లో ఇల్లు మంజూరు ఒకరికి కేటాయించారు. కాగా నిర్మాణానికి సంబంధించిన బిల్లులు మాత్రం మరొకరి ఖాతాలో జమకావడంతో ఖమాన గ్రామంలో గందరగోళం నెలకొన్నది. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- పేరు ఒకటిగా ఉండడంతో..
మండలంలోని ఖమాన గ్రామంలో లోహబడే సోని అనే పేర్లతో ఇద్దరు లబ్ధిదారులు ఉండగా వారి భర్తల పేర్లుకూడా లోహబడే శ్రావణ్‌గా ఒకే రకంగా ఉన్నాయి. వీరిలో ఒకరు ఇంటి నిర్మాణం చేపట్టగా మరొక లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించలేదు. లోహబడే సోని, భర్త శ్రావణ్ అనే లబ్ధిదారుడికి సంబంధించిన ఇంటి నిర్మాణం బేసిమెంట్ వరకు పూర్తి కావడంతో బిల్లు కోసం అధికారుల చుట్టూ తిరిగారు. ఇంటి బిల్లు వేసి వారం రోజులైందని ఖాతాలో చూసుకోవాలని గృహనిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారుడికి తెలిపారు. సదరు లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాను పరిశీలించగా డబ్బులు జమా కాలేదు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేశారు. అధికా రులు ఈ డబ్బు విషయమై పరిశీలించగా అదే గ్రామానికి చెందిన మరో లబ్ధిదారులైన సోని ఖాతాలో జమా అయినట్లు ధ్రువీకరించారు. డబ్బులు జయ అయిన లబ్ధిదారులు నేటికి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించలేదు. అసలు లబ్ధిదారుడి ఖాతాలో జమా కావాల్సిన బినామి ఖాతాలో జమకావడంతో అధికారులు కంగుతిన్నారు. క్షేత్రస్థాయి అధి కారులు చేసిన నిర్లక్ష్యం వల్ల అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా తన పేరుతో ఇల్లు మంజూరైనప్పటికీ బిల్లు మాత్రం వేరే వ్యక్తి ఖాతాలో జమ కావడంతో తీవ్ర అన్యాయం జరిగిందని అసలు లబ్ధిదారు లోహబడే సోని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద డబ్బులేవని తమతో ఇల్లు కట్టడం కుదరదని ఎంత చెప్పినా కార్యదర్శి పనులు చేయించారని, అధికారులు డబ్బులు తమకు అందేలా చూడాలని కోరారు. ఈ విషయమై ఎంపీడీవో పాటిల్ జోత్స్న, గృహనిర్మాణ శాఖ ఏఈ నాగరాజును వివరణ కోరగా ఇద్దరు లబ్ధిదారుల పేర్లు ఒకే రకంగా ఉండడం వల్ల బిల్లు మంజూరీలో పొరపాటు జరిగి ఉండవచ్చని చెప్పారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అర్హులైన లబ్ధిదారుడి ఖాతాలో డబ్బులు జమయ్యేలా చూస్తామని తెలిపారు.